కరోనా ప్రస్తుత ఉద్ధృతిని బట్టి అంచనా వేస్తే మూడోవేవ్‌కి అంతగా ఆస్కారం కనిపించటం లేదని, ఒక వేళ అది సంభవించినా ఇప్పుడున్నంత తీవ్రంగా ఉండే అవకాశం లేదని ప్రొఫెసర్ డాక్టర్ గౌతంమీనన్ అభిప్రాయపడ్డారు. దిల్లీ అశోకా యూనివర్సిటీలో ఫిజిక్స్, బయోలజీ ఆచార్యులుగా పనిచేస్తున్న ఆయన.. అంటువ్యాధుల మోడలింగ్‌పై ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నారు. ‘ఆదివారం మంథన్’ నిర్వహించిన కార్యక్రమంలో ‘కొవిడ్-19 నిన్న, నేడు, రేపు’ అనే అంశంపై మాట్లాడారు.
టీకా వేయించుకోవడమే పరిష్కారం..!
కరోనా నుంచి బయటపడేందుకు టీకా వేయించుకోవటం ఒక్కటే పరిష్కారమని, మొత్తం జనాభాలో 50-60 శాతం మంది టీకాలు వేయించుకున్నప్పుడు ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ సాధ్యమవుతుందన్నారు. అప్పటి వరకూ కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. ఈ సారి ఎక్కువ మంది యువకులకు ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాన్ని కొట్టేశారు. టీకాలు వేసుకున్నా.. వైరస్ నుంచి రక్షణ ఉండదనేది అపోహ మాత్రమేనని, టీకాలతో యాంటీబాడీలు తయారై శరీరానికి వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందన్నారు. మోడలింగ్‌ల ద్వారా పరిస్థితి తీవ్రతను అంచనావేయవచ్చని, తగిన సన్నద్ధత వీలవుతుందని చెప్పారు.