పెరిగిన ఆసరా పింఛన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. లబ్ధిదారులు జులై నెలలో పెరిగిన పింఛన్లు అందుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసరా పథకం కింద ఇచ్చే సామాజిక పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ల వయసును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. అందుకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నిధులు కేటాయించారు.
పెరిగిన లబ్ధిదారులు
అర్హత వయసు తగ్గించిన నేపథ్యంలో కొత్త లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేసింది. కొత్తగా ఆరు లక్షలకు పైగా లబ్ధిదారులను గుర్తించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఈ నెల 27తో ముగియడం వల్ల పెంచిన ఆసరా పింఛన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు నెలకు రూ.3,016, మిగతా వారికి నెలకు రూ.2,016 ఆసరా కింద అందించనున్నారు.