స్థానిక సంస్థల ఎన్నికలపై సీఈసీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈనెల 11న రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఫలితాలను మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం విడుదల చేస్తారు. కొన్ని జిల్లాల్లో మూడు, మిగతా చోట్ల రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల వెలువడేందుకు 40 రోజులు సమయం ఉండడం వల్ల ఆలోగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
రెండు, మూడు దశల్లో పోలింగ్
సున్నిత ప్రాంతాలు ఎక్కువుగా ఉన్న భూపాలపల్లి, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో మూడు విడతల్లో పోలింగ్ అవసరమని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. పరిస్థితులకు అనుగుణంగా రెండు, మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ముగియడానికి సుమారు నెల రోజులు సమయం పట్టనుంది.