తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఏపీలో బదిలీలు... సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'

ఏపీలో నూతనంగా ఏర్పాటైన వైకాపా ప్రభుత్వం భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేపట్టింది. సీఎం కార్యాలయం సహా, డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్​ను బదిలీ చేసింది. కొత్త డీజీపీగా గౌతం సవాంగ్​ను నియమించింది.  ఏసీబీ డైరెక్టర్​గా విశ్వజిత్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : May 31, 2019, 10:03 AM IST

jagan


ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్... కొద్ది గంటల్లోనే అధికారుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన జట్టును రూపొందించుకోవడంపై దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో... కొత్త వారిని ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులతో పాటు డీజీపీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్​ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు సాధారణ పరిపాల శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

సీఎం కార్యాలయంలో బదిలీలు..

ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలుమొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ‍్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్‌ చంద్ర, ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్‌, సీఎం కార్యదర్శిలు గిరిజా శంకర్‌, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

సీఎం ఓఎస్డీగా పి. కృష్ణామోహన్ రెడ్డి....

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీగా కృష్ణమోహన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జోవో జారీ చేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎస్.ఎస్ రావత్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్​ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 30 నుంచి ఆదేశాలు వర్తిస్తాయని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

డీజీపీగా సవాంగ్...

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్​ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్ జనరల్​గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్​ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్​ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్​గా​ బదిలీ చేసింది.

ఏసీబీ డైరెక్టర్ బదిలీ...

అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్​గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్​గా కుమార్ విశ్వజిత్​ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details