తెలుగుదేశం హయాంలో అనినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం.... సీబీఐ దర్యాప్తుతో నిజాలు తేల్చాలని నిర్ణయించింది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, ఫైబర్ నెట్ పథకాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు.
'జగనన్న తోడు పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 45- 60 ఏళ్లు గల మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం అందనుంది. దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కోసం వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చుకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టు తీర్పు ప్రకారం జీవోలో మార్పులకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఐదేళ్లు ఉన్న తర్వాతే ఇల్లు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది' అని మంత్రి పేర్నినాని తెలిపారు.