రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో సిబ్బందికి అందజేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌లకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లిపోయారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా ఉండే పోలింగ్ కేంద్రాల వద్ద మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మాక్‌పోల్ సమయానికి ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవాలి:
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఈవో రజత్‌కుమార్ వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్‌లో మాత్రం మాక్ పోలింగ్‌కు గంట సమయం ఎక్కువవుతుందని చెప్పారు. అందుకే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మాక్‌పోల్ సమయానికి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
కీలక ప్రాంతాల్లో అందుబాటులోకి హెలికాప్టర్లు:
ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు నిలవగా... నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది, అత్యల్పంగా మెదక్ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34,604 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు, అందులో 6,445 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే అప్రమత్తమయ్యేందుకు రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు.
రేపు ఎన్నికల విధుల్లో 2.20 లక్షల మంది సిబ్బంది:
రేపు ఎన్నికల విధుల్లో దాదాపు 2.20 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. భద్రతా విధుల్లో 145 కంపెనీలకు సంబంధించిన కేంద్ర బలగాలు ఉంటాయన్నారు. నిజామాబాద్‌లో 12 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నందున 600 మంది ఇంజినీర్లు ఎన్నికల విధులు నిర్విహిస్తారని తెలిపారు.