లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికలకు 72 గంటల ముందు నుంచి ప్రొటోకాల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌కు 48గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు సామూహిక ఎస్‌ఎంఎస్‌లకు అనుమతి లేదన్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని, సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
నిజామాబాద్‌లో 8గంటల నుంచి పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 34,604 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు, అందులో 6 వేల 445 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని, అనంతరం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు.
ఓటర్ కార్డుతోనే కాదు మరో 11 కార్డులతోనూ ఓటేయొచ్చు
రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 97 లక్షల 8 వేల 599 మంది ఓటర్లున్నట్లు రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో 1 కోటి 49 లక్షల 30 వేల 726 మంది పురుషులు కాగా... 1 కోటి 47 లక్షల 76 వేల 370 మంది స్త్రీలు. అంతేకాకుండా 1504 మంది ఇతరులు, 11 వేల 320 సర్వీస్ ఓటర్లు , 1731 మంది ఎన్నారైలు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేవలం ఓటర్ కార్డుతోనే కాకుండా మరో 11 గుర్తింపు కార్డులతో కూడా ఓటు వేయవచ్చని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు