తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అఖిలేశ్​యాదవ్​ అడ్డగింతపై రాజకీయ దుమారం.... - Lucknow

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ అలహాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారానికి వెలుతుండగా లఖ్​నవూ విమానాశ్రయ పోలీసులు అడ్డుకున్నారు.

అఖిలేశ్​యాదవ్​ అడ్డగింతపై రాజకీయ దుమారం

By

Published : Feb 13, 2019, 1:16 AM IST

లఖ్​నవూ విమానాశ్రయ ఘటనలో పలు రాజకీయ నేతలు ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌కు మద్దతుగా నిలిచారు. విమానాశ్రయ పోలీసులు అఖిలేశ్​ను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నాయకులు దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.

అఖిలేశ్​ యాదవ్​ అలహాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళుతుండగా ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి విమానం వెళ్లిపోయిన తరువాత అఖిలేశ్​ను బయటకు పంపించారు.

ప్రయాగ్​రాజ్​ వెళ్లకుండా యూపీ పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకోవడంపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ 'కుట్ర' చేస్తోందంటూ మండిపడ్డారు. ఎలాంటి ఆదేశాలు లేకుండానే తనను అడ్డుకున్నారని ట్వీట్​ చేశారు.

" ఏ రాతపూర్వక ఆదేశాలు లేకున్నా లఖ్​నవూ విమానాశ్రయ అధికారులు నన్ను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం నాయకుడి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో ఇప్పుడు స్పష్టమవుతోంది. మన దేశ యువత ఇలాంటి అన్యాయాన్ని సహించరని భాజపాకు తెలుసు. "
- అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత

పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లఖ్​నవూ పోలీసుల తీరును తప్పుబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు.

"ఇప్పటికే నేను అఖిలేశ్​యాదవ్​తో మాట్లాడాను. అఖిలేశ్​ను విద్యార్థుల సమావేశానికి హాజరవకుండా అడ్డుకున్న భాజపా నేతల అహంకార పరిపాలనను మేమందరం ఖండిస్తున్నాం. జిగ్నేశ్​ మేవానీనీ అనుమతించలేదు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? "
- మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి

"ఇది చాలా దురదృష్టకరమైన చర్య, పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎస్పీ-బీఎస్పీ కూటమిని చూసి భాజపా భయపడుతోంది. "

-మాయావతి, ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి

సమాజ్​వాదీ పార్టీ ఎంపీల ధర్నా...

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో సమాజ్​వాదీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలు చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజ్​భవన్​ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు గవర్నర్​ హామీతో ధర్నాను విరమించారు.

అఖిలేశ్​యాదవ్​ అడ్డగింతపై రాజకీయ దుమారం

ABOUT THE AUTHOR

...view details