మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా
08:29 October 22
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా
పురపోరుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది. పదవీకాలం ముగిసిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే కసరత్తు ప్రారంభించాయి. అయితే ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగంగా వార్డుల విభజన తదితర అంశాలు చట్టబద్ధంగా జరగలేదని, లోపాలున్నాయని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాటి ఆధారంగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. ఆ తర్వాత అన్నింటినీ సరిచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్నికల ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా జరగలేదంటూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.
ఇదీ చూడండి: పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట.. టెండర్ల నిలిపివేత