దేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల కోసం జైడస్ క్యాడిలా రూపొందించిన టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. జైడస్ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తి అయినట్లు వెల్లడించింది. టీకా వినియోగ అనుమతి కోసం ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కు దరఖాస్తు చేసుకున్నట్లు దిల్లీ హైకోర్టుకు తెలిపింది. మైనర్లకు కూడా టీకా అందించాలని కోరుతూ దిల్లీకి చెందిన తియా గుప్తా అనే ఓ మైనర్ బాలిక దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న పిల్లల టీకా! - చిన్నారులకు టీకా
పిల్లల కోసం జైడస్ క్యాడిలా తీసుకువచ్చిన కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. చిన్నారులపై ఈ టీకాకు సంబంధించిన ప్రయోగాలు పూర్తి అయినట్లు వెల్లడించింది.
గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ, ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్ టీకా. జులై 1వ తేదీన కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకొంది. 12 ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుందని వెల్లడించింది. 28వేల మందిపై చేసిన ప్రయోగాల మధ్యంతర ఫలితాల నివేదికను డీసీజీఐకి అందజేసింది. ఒకవేళ దీనికి అనుమతులు వస్తే రెండో భారతీయ టీకాగా నిలుస్తుంది. దీనిని మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. జైడస్ క్యాడిలా ప్రకారం.. 0-28-56 రోజుల్లో ఈ టీకా తీసుకోవాలి. రెండు డోసుల టీకా కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు జైడస్ వెల్లడించింది. మరోవైపు చిన్నారుల కోసం కరోనా టీకాను తీసుకువచ్చేందుకు భారత్ బయోటెక్ కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల చిన్నారులపై టీకా ప్రయోగాలను మూడు దశల్లో కొనసాగిస్తోంది. 12 నుంచి 18 ఏళ్ల వయసువారిపై ప్రయోగాలు పూర్తికాగా.. ఆరు నుంచి 12 ఏళ్ల పిల్లలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:రెండు డోసులు తీసుకున్న వారికి ఆ భయం లేదు!