తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలో అందుబాటులోకి జైడస్​ టీకా! - జైకోవ్​-డి వ్యాక్సిన్​

జైడస్​ క్యాడిలా అభివృద్ధి చేసిన 'జైకోవ్‌-డి' టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. జైకోవ్‌-డికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే.. దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా ఇదే కానుంది. అయితే ఈ టీకా మూడు డోసులలో లభిస్తుంది.

zydus cadila vaccine, జైడస్​ క్యాడిలా టీకా
జైకోవ్​-డి వ్యాక్సిన్

By

Published : May 8, 2021, 2:26 PM IST

కరోనా మహమ్మారి ప్రళయం కొనసాగుతున్న వేళ.. కొవిడ్‌ కోరలను విరిచి వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మరో వ్యాక్సిన్‌ అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన 'జైకోవ్‌-డి' టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే టీకాకు అనుమతులు లభిస్తాయని జైడస్‌ విశ్వాసంగా ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జైకోవ్‌-డి మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను సంస్థ ప్రారంభించింది. 28వేల మందిపై ప్రయోగాలు జరిపింది. అతి త్వరలోనే ఈ టీకా మధ్యంతర సామర్థ్య ఫలితాలు రానున్నాయట. ఆ ఫలితం వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు జైడస్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. మే నెలలోనే తమ టీకాకు అనుమతులు లభించే అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అత్యవసర అనుమతులు లభించిన వెంటనే టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామని, నెలకు కోటి డోసుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

మూడు డోసుల టీకా..

జైకోవ్‌-డికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే.. దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా ఇదే కానుంది. అయితే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి మాదిరిగా కాకుండా.. ఇది మూడు డోసుల టీకా. మొదటి డోసు వేసుకున్న నెల రోజులకు రెండో డోసు.. ఆ తర్వాత మరో నెలకు మూడో డోసు వేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. మూడు డోసుల వల్ల అధిక రోగనిరోధక శక్తి లభించడం సహా యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ చెబుతోంది. అంతేగాక, తమది పెయిన్‌లెస్‌(నొప్పి లేని) వ్యాక్సిన్‌ అని తెలిపింది. అయితే రెండో డోసుల టీకాపై తాము ప్రయోగాలు చేస్తున్నట్లు జైడస్‌ పేర్కొంది.

జైడస్‌ క్యాడిలా తయారుచేసిన 'విరాఫిన్‌' ఔషధానికి ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకే మోతాదులో వాడే ఈ యాంటీవైరల్‌ ఇంజక్షన్‌ను.. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా ఇస్తారు.

ఇదీ చదవండి :రెమ్‌డెసివిర్‌ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details