స్కూల్ అనగానే ప్రతి ఆదివారం సెలవు.. మధ్యలో పండుగలకు ఓ పది రోజుల సెలవులు.. వేసవి సెలవుల సంగతి సరేసరి. కానీ ఈ పాఠశాలలో అవేవీ ఉండవు. సంవత్సరంలో ఉన్న 365 రోజులు రావాల్సిందే. అది కూడా రోజుకు 12 గంటలు. అదే ఆ బడి ప్రత్యేకత.
మహారాష్ట్రలోని నాశిక్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలోని ఉంది ఈ పాఠశాల. ఈ స్కూల్ ఏడాదిలో 365 రోజులు.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తోంది. త్రయంబకేశ్వర్ తాలుకాలోని హివాలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1 నుంచి 5వ తరగతి పిల్లలు సుమారు 1000 ఎక్కాలను ఒకేసారి రెండు చేతులతో అవలీలగా రాసేస్తున్నారు. జనరల్ నాలెడ్జ్‌తో పాటు రాజ్యాంగంలోని అన్ని క్లాజులు, జాతీయ రహదారుల పేర్లు చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు.. వాటి రాజధానులు పేర్లను పుస్తకాలు చూడకుండానే అప్పగించేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అడిగే గణితం, లాజికల్ ప్రశ్నలకు తక్కువ వ్యవధిలోనే సరైన సమాధానాలు చెప్పేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షల్లోను సత్తా చాటుతున్నారు ఇక్కడి విద్యార్థులు.