తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరుద్యోగ భృతికి ఆసక్తి చూపని యువత- వారం రోజుల్లో 20వేల దరఖాస్తులే- కారణమేంటి? - కర్ణాటకలో నిరుద్యోగ భృతి

Yuva Nidhi Scheme Karnataka 2023 : నిరుద్యోగుల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యువనిధి' పథకానికి ఆదరణ కరవైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి వారం రోజులైనా ఇప్పటివరకు 19,800 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నా వేలల్లో దరఖాస్తుల రావడం చర్చనీయాంశమైంది.

Yuva Nidhi Scheme Karnataka 2023
Yuva Nidhi Scheme Karnataka 2023

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 6:28 PM IST

Yuva Nidhi Scheme Karnataka 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఐదు గ్యారెంటీల్లో 'యువనిధి' పథకం ఒకటి. ఈ పథకం కింద నిరుద్యోగులకు అంటే డిగ్రీ పూర్తి చేసినవారికి నెలకు రూ.3వేలు, డిప్లొమా చదివిన వారికి రూ.1,500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది ఆ పార్టీ. ఇలాంటి మరికొన్ని హామీలతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ 'యువనిధి' పథకానికి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను 2023 డిసెంబరు 26 నుంచి ఆహ్వానించింది. అర్హులైన నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. అయితే 'యువనిధి' పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభమై వారం అవుతున్నా ఇప్పటివరకు 19,800 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. యువనిధి పథకానికి అంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం పట్ల అధికారులు సైతం విస్తుపోతున్నారు.

2023-2024 ఆర్థిక సంవత్సరంలో 'యువనిధి' పథకానికి రూ.250 కోట్లు కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.1,250 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. అర్హులు సేవాసింధు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి అకౌంట్​లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.

అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో నాలుగింటికి రిజిస్ట్రేషన్ సమయంలో విశేష స్పందన వచ్చింది. ఆ పథకాలకు ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కొన్నిసార్లు సర్వర్ కూడా డౌన్ అయ్యింది. అయితే యువనిధి పథకానికి మాత్రం అంతగా స్పందన రాలేదని ప్రభుత్వ అధికారి ఒకరి తెలిపారు.

యువనిధి లబ్ధిదారుల అంచనా
2022-23లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి యువనిధి పథకానికి 5.3 లక్షల మంది అర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరిలో దాదాపు 4.8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాగా, 48,100 మంది డిప్లొమా విద్యార్థులు ఉన్నట్లు తెలిపింది. యువనిధి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు 19,800 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇది యువనిధి పథకానికి అర్హులైన నిరుద్యోగుల సంఖ్యలో 4 శాతం మాత్రమే కావడం గమనార్హం. బెలగావి నుంచి 2,316 దరఖాస్తులు, బెంగళూరు సిటీ నుంచి 1,974, రాయచూర్‌ 1,126, బాగల్‌కోట్‌ 1,109, విజయపూర్‌ 973, తుమకూరులో 904 దరఖాస్తులు వచ్చాయి. కొడగు జిల్లాలో అత్యల్పంగా 54, చామరాజనగర్ జిల్లాలో 95 దరఖాస్తులు వచ్చాయి.

యువనిధి పథకం అంటే ఏమిటి?
యువనిధి పథకం ద్వారా నిరుద్యోగులకు 24 నెలల పాటు భృతి అందజేస్తుంది ప్రభుత్వం. డిగ్రీ అభ్యర్థులకు రూ.3వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1500 ఇస్తుంది. 2022-23లో పాసైన వారికి ప్రతి నెల ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

'లౌకికవాదమే ప్రజాస్వామ్యానికి పునాది- అధికార పార్టీ తీరుతో సమాజంలో విభజన'

చెన్నై వరద బాధితుల పరిస్థితి తీవ్రంగా కలచివేసింది : మోదీ

ABOUT THE AUTHOR

...view details