YSRCP Politics in AP: వైఎస్సార్సీపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ఆయనను అక్కడి నుంచే పోటీచేయాలని, ఎవరి నుంచీ సమస్యలు ఉండవని చెప్పినట్లు సమాచారం. మంత్రి ఉష శ్రీచరణ్ తాను ఈసారి పెనుకొండ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కల్యాణదుర్గం నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దించే అవకాశం ఉంది.
రెండు మూడు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్తున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసేందుకు తనకు సీఎం అవకాశమిచ్చారని విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ టికెట్ మరో బీసీకి ఇవ్వచ్చని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్, సెంట్రల్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుల్లో ఒకరికి ఈసారి అవకాశం లేనట్లేనని తెలిసింది. ఈ రెండు సీట్లలో ఒకటి ఒక విద్యాసంస్థ యజమాని అయిన ముస్లింకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుపాను - 'టికెట్ రాకున్నా హ్యాపీ - ఓడిపోవడం కంటే అదే బెటర్'
గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడును నిలబెట్టనన్నట్లు సమాచారం. గురువారమే రాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరు వెళ్లాలనుకున్నా జగన్ ఆయనను ఒంగోలు నుంచే మళ్లీ పోటీచేయాలని స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విషయంలో చర్చ జరిగినా ఆయనకు సీఎం ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది.
మాజీ మంత్రి పేర్ని నాని, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ సీఎం కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్యనేతలతోపాటు సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి వెళ్లారు. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో మాధవ్‌ను మారుస్తారా, ఈసారి పూర్తిగా పక్కన పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది.