వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా YSRCP Kurnool MP Dr Sanjeev Kumar Resigns:వైఎస్సార్సీపీలో రాజీనామాల పర్వం కొసాగుతొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అంటూ తేడా లేకుండా పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీలో గెలుపు గుర్రాలే లక్ష్యంగా సీఎం జగన్ మార్పులు చేస్తుండగా, పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఈ కోవలోకి మరో ఎంపీ చేరారు. పార్టీ పెద్దల నిర్ణయంతో ఎంపీ పదవికీ, వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
అభివృద్ధి చేసే అవకాశం రాలేదు: కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్సార్సీపీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీటు కేటాయింపు విషయమై పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన సంజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంపీగా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు రాలేదన్న సంజీవ్ కుమార్, తన పరిధిలో 10 శాతమే పనులు చేసుకోగలిగానని తెలిపారు. పార్టీలో కొనసాగుతూ పనులు చేయలేననేది తన అభిప్రాయమని వెల్లడించారు.
సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని - రాజకీయ వర్గాల్లో చర్చ
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది తన లక్ష్యం అని సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. తన పరిధిలో ఉన్నంత వరకు నేను పనులు చేశానని తెలిపారు. పార్టీ నుంచి వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. తన సన్నిహితులతో మాట్లాడి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటానని సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటానని తెలిపారు.
తాడేపల్లికి క్యూ కడుతున్న వైసీపీ నేతలు - తాజాగా కొంతమందికి పిలుపు
ఈ పార్టీలో ఉంటే పనులు చేయలేను: ప్రభుత్వ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, కానీ అభివృద్ధి మాత్రం లేదని తెలిపారు. ప్రజలు స్వశక్తితో నిలబడే ప్రయత్నాలు కావాలని తెలిపారు. రాయలసీమకు న్యాయరాజధాని అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, మాకు న్యాయరాజధాని వస్తే సరిపోదని, ప్రారిశ్రామిక అభివృద్ధి కావాలని తెలిపారు. ఈ పార్టీలో ఉంటే పనులు చేయలేనని, అందుకే బయటికి రావాలనుకున్నానని తెలిపారు. బీసీలకు పెద్ద పీఠ వేశాం అని చెప్పడం తప్పా, పార్టీలో బీసీలకు ఎలాంటి పవర్ లేదని తెలిపారు. కొంత మంది మాత్రమే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని తెలిపారు. బీసీలకు అవకాశం ఇస్తున్నారని వైఎస్సార్సీపీలోకి వచ్చామని, కానీ ఈ పార్టీలో సైతం అలాంటి అవకాశాలు లేవని సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ - ఎన్నికల్లో ఓటేసేదే లేదన్న గ్రామస్థులు