YSRCP Government Scams: అసలు దోపిడీ అంటే ఏంటో తెలుసా..? గత ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చిన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చేసి, దివాలా తీసిన కార్పొరేట్ సంస్థను తెర ముందు పెట్టి.. ఎడాపెడా దోచేయడమే.
- కుంభకోణం అంటే ఏంటో తెలుసా?..మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాసిరకం బ్రాండ్‌లతో మద్యపాన ప్రియుల ఆరోగ్యాన్ని.. ధరలు పెంచేసి వారి డబ్బును కొల్లగొడుతూ, అస్మదీయుల కంపెనీల నుంచే మద్యం కొంటూ వేల కోట్లు దిగమింగడమే.
- కొల్లగొట్టడం అంటే ఏంటో తెలుసా?..లాభసాటిగా ఉన్న గనులను నయానో, భయానో ప్రభుత్వ పెద్దల గుప్పిట్లోకి తెచ్చుకోవడం అదే విధంగా ఏజెన్సీలోని లేటరైట్, బాక్సైట్ సహా విలువైన ఖనిజాల్ని కొల్లగొట్టి కోట్లు దండుకోవడం. కొండలు, గుట్టలు, చెరువులు (Illegal Soil Mining in AP) అన్న తేడా లేకుండా, ఎక్కడ మట్టి కనపడినా వైసీపీ నాయకులు ఎగబడి కొల్లగొట్టేయడమే.
- సంక్షేమం మాటున మింగేయడం అంటే ఏంటో తెలుసా?..పేదలకు సెంటు పట్టాలు ఇవ్వడానికి భూసేకరణ, చదును చేసే పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేయడమే.
- లూటీ అంటే ఏంటో తెలుసా?..అవసరం లేకపోయినా వ్యవసాయ మోటార్లకు, గృహావసరాలకు స్మార్ట్ మీటర్ల పేరుతో వేల కోట్ల కాంట్రాక్ట్‌ను అడ్డదారిలో అస్మదీయులకు దోచిపెట్టడం..! వారి నుంచి ప్రభుత్వ పెద్దలు కోట్లు దండుకోవడం.
- స్వాహా చేయడం అంటే ఏంటో తెలుసా?..కాంట్రాక్టులన్నింటినీ ప్రభుత్వ పెద్దల కోటగిరీలోని వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టడం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించేందుకు 20 శాతం చొప్పున కమీషన్లు కొట్టేయడం.
- సహజ వనరుల్ని చెరబట్టడం అంటే తెలుసా?..విశాఖ సహా వివిధ ప్రాంతాల్లోని రూ.కోట్ల విలువైన భూముల్ని అడ్డగోలుగా కొట్టేయడం. మడ అడవుల్ని నాశనం చేయడం.
- అక్రమం అంటే ఏంటో తెలుసా?..రేషన్ బియ్యం దొంగ రవాణా చేయడం, రాష్ట్రంలోని పోర్టుల్ని, సెజ్‌ల్ని అస్మదీయులపరం చేయడం. టీడీఆర్ బాండ్‌ల పేరుతో చేతివాటం ప్రదర్శించడం.ఎసైన్డ్ భూముల్ని కొట్టేయడం.. ఇవీ కుంభకోణాలంటే.
వాటిని పరిచయం చేసింది ఎవరో..: అసలు షెల్ కంపెనీలకు ఆద్యుడు, ‘క్విడ్ ప్రోకో’ వంటి పదాల్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిందే జగన్ కదా!.. అనే చర్చ ప్రజల్లో విస్తృతంగా సాగుతోంది. తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవిని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు దోచుకున్నట్లుగా వచ్చిన అభియోగాలు, సీబీఐ, ఈడీ ఆయనపై నమోదు చేసిన కేసులు, వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు సాగిస్తున్న దోపిడీపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.
వెనకేసుకున్నదెంత?: దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేంటి? ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానాన్ని తీసుకొచ్చి, మొత్తం వ్యాపారాన్ని అస్మదీయులకు అప్పగించి కోట్లు కొల్లగొడుతోంది వాస్తవం కాదా? ప్రభుత్వ పెద్దలకు కమీషన్ ముట్టచెబుతున్న కంపెనీల నుంచే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది నిజం కాదా? కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలకు ఏటా కోట్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ లెక్కన వెనకేసుకున్నదెంత?
మరి ఇది స్కాం కాదా: ఏపీఎస్‌బీసీఎల్ వద్ద సుమారు 100 కంపెనీలు నమోదు చేసుకోగా... వాటిలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు, కమీషన్లు చెల్లిస్తున్న 16 కంపెనీలకే మద్యం కొనుగోళ్లు ఆర్డర్లు ఇవ్వడాన్ని కుంభకోణం అనరా? రాయలసీమలోని ఒక దివంగత నేతకు చెందిన మద్యం కంపెనీని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న నాయకుడి కుమారుడు స్వాధీనం చేసుకోవడం, ఆ కంపెనీకే ఏపీఎస్‌బీసీఎల్ రెండేళ్లలో 18 వందల63 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం కొనడానికి ఆర్డరివ్వడం స్కాం కాదా?
Illegal mining: ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు.. ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి
ఏ స్థాయిలో మింగేస్తున్నారు: మద్యం నిషేధిస్తామనే హామీని తుంగలో తొక్కి, నాసిరకం బ్రాండ్‌లు మాత్రమే దొరికేలా చేసి, ధరలు విపరీతంగా పెంచేయడం ప్రజల్ని దోచుకోవడం కాదా? ఇది కదా స్కాం అంటే! ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం వ్యాపారాన్ని కొందరు రాజకీయ నాయకులు, అధికారులు సిండికేట్‌గా ఏర్పడి తమ ఆధీనంలోకి తెచ్చుకుని, మూడేళ్లలో 2 వేల కోట్ల లబ్ధి పొందారని ఈడీ తేల్చింది. 800 దుకాణాలున్న ఛత్తీస్‌గఢ్‌లోనే అంత పెద్ద కుంభకోణం జరిగితే, 2,934 దుకాణాలున్న ఏపీలో, మద్యం వ్యాపారం మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీపా నాయకులు, వారి అస్మదీయులు ఏ స్థాయిలో మింగేస్తూ ఉండాలి?.
ఇది కుంభకోణం కాదా?: గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా దొరికిన ఇసుకనూ అధికార పార్టీ నాయకులు దిగమింగడం కుంభకోణం కాదా? వైసీపీ భాషలో దాన్ని ప్రజాసేవ అంటారా? క్షేత్రస్థాయి నాయకుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు.. ఈ దోపిడీలో భాగస్వాములే. జేపీ పవర్ వెంచర్స్ అనే దివాలా తీసిన, NCLTకి వెళ్లిన ఉత్తరాది కంపెనీని తెరపైకి తెచ్చి.. రాష్ట్రంలోని మొత్తం ఇసుక వ్యాపారాన్ని ఆ సంస్థకు కట్టబెడుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన, చెన్నైకు చెందిన వివాదాస్పద వ్యాపారికి సంబంధించిన టర్న్‌కీ అనే సంస్థని ఉపగుత్తేదారుగా రంగంలోకి దించారు.
ఆన్‌లైన్ బుకింగ్‌లు, డిజిటల్ చెల్లింపులు, కంప్యూటరైజ్డ్ బిల్లులు లేవు. ఎంత తవ్వుతున్నారో, ఎంత అమ్ముతున్నారో లెక్కల్లేవు. అప్పటి వరకు జరిగిన దోపిడీ ఒక లెక్క. గత ఏడాది ఆగస్టు నుంచి టర్న్‌కీని తప్పించి.. ఇసుక వ్యాపారాన్ని జిల్లాల వారీగా వైసీపీ నేతల ఆధ్వర్యంలోని సిండికేట్‌ల చేతుల్లో పెట్టినప్పటి నుంచి జరుగుతున్న దోపిడీ మరో లెక్క. జిల్లాలలోని సిండికేట్‌ల నుంచి ఏటా సుమారు 1,800 కోట్ల రూపాయలు వసూలు చేసి, ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయలు చెల్లించి, మిగతా రూ.1,035 కోట్లను ప్రభుత్వ పెద్దలకు కప్పం కడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిండికేట్‌లు తవ్వుకుని, అమ్ముకుని, కొల్లగొట్టేది దీనికి అదనం. పర్యావరణ అనుమతుల్లేకుండా, ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్నీ బేఖాతరు చేసి ఇష్టానుసారం దోచేయడాన్ని ఏమంటారు?.