YSRCP Assembly and Parliament Constituencies Incharges Changing: పశ్నించే గొంతును కోస్తారని వైఎస్సార్సీపీ సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటనతో అధికార వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి రుజువు చేసింది. 'దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా? పాపమా? నేనేం తప్పు చేశాను? వ్యతిరేకత దళితులమైన మా సీట్లలోనే ఉందా? డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్లు ఎవరి తలరాతలైనా మారుస్తారా? అంటూ ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టేశారు. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా డాక్టర్ మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు.
సునీల్ 2014-19 మధ్య ఇదే పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంఎస్ బాబుకు అన్యాయం చేసినట్లే 2019లో సునీల్‌ను పక్కను పెట్టారు. ఆయన అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన్నే ఇన్‌ఛార్జిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజవర్గంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన భార్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటంతో శ్రీనివాస్‌ను తప్పించి ఆయన భార్య వాణిని సమన్వయకర్తగా నియమించారు.
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా
కొన్ని నెలలు గడవకుండానే తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌నే టెక్కలి సమన్వయకర్తగా నియమించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ పిలిచి మాట్లాడారు. ఈసారి కూడా మీరే కొనసాగుతారని చెప్పి పంపారు. తాజాగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. ఆ పదవిని, అధికారాన్ని వదులుకుని అప్పట్లో వైఎస్సార్సీపీలో చేరారు.
అధికారంలోకొస్తే మంత్రి పదవిస్తామని వైఎస్సార్సీపీపెద్దలు ఆయనకు హామీనిచ్చారు. ఏ పదవీ ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్టే గల్లంతు చేశారు. మూడో జాబితాలో ఓ మంత్రి తమ్ముడు అసెంబ్లీ, మరో మంత్రి కొడుకును లోక్‌సభకు పంపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్‌ను తాజాగా కర్నూలు జిల్లా కోడుమూడు(ఎస్సీ) నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే సుధాకర్‌ను పక్కన పెట్టేశారు.