YSRCP activists Attack on Three Persons in Eluru district: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. యథేచ్చగా దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తమను అడ్డుకునే వారు లేరని ఇష్టారాజ్యానికి పాల్పడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేసి.. తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ అమానవీయ ఘటన.. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని నిశ్చేష్టులను చేసింది. కోళ్లు దొంగతనం పేరుతో.. ముగ్గురు వ్యక్తులను దారుణంగా కొట్టి, వారి మర్మాంగాలను కటింగ్ ప్లేయర్‌తో నొక్కి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన బాధితుల ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Atrocity in Eluru district: తిమ్మాపురం గ్రామానికి చెందిన ముప్పిన సురేష్, అరటికట్ల రాంబాబుతోపాటు ఓ దళిత బాలుడిని ఈ నెల 25వ తేదీ రాత్రి.. అదే గ్రామానికి చెందిన అప్పసాని ధర్మారావు, కొనకళ్ల అప్పారావు, ఆచంట రాకేష్, ఘంటా శేఖర్, తోకల సిద్ధిరాజు, మురుగుల దుర్గారావులు పని ఉందని చెప్పి వాళ్లు నాటు కోళ్లు పెంచే తోటలోకి తీసుకెళ్లారు. మా కోళ్లను దొంగిలించింది మీరేనా అని గద్దిస్తూ, దుస్తులు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. చుట్టు పక్కల వాళ్లు చూస్తుండగానే కర్రలు, ప్లాస్టిక్ పైపులతో వాళ్లను కొట్టి, చిత్రహింసలు పెట్టారు. వీపుపై వాతలు తేలిన దెబ్బలతో బాధితులున్న చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుల్లో ఒకరైన దళిత బాలుణ్ని కులం పేరుతో దూషించారు. ‘మా కోళ్లనే దొంగతనం చేస్తావా.. ఈ రోజు మా చేతుల్లో చచ్చిపోతావ్’ అంటూ భయాందోళనకు గురిచేశారు.