తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viveka case: వివేక హత్య కేసు దర్యాప్తులో..సీబీఐకి ఎదురైన సవాళ్లు, అధిగమించిన అడ్డంకులు - YS Viveka murder case cbi enquiry news

YS Vivekananda Reddy murder case updates: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు మొదలుపెట్టిన రోజు నుంచి నేటిదాకా ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, ఆరోపణలను, కేసులను, బెదిరింపులను అధిగమించి.. దాదాపు నాలుగేళ్ల తర్వాత కేసును కొలిక్కి తీసుకొచ్చింది. అయితే, సీబీఐ.. వివేక హత్య కేసు దర్యాప్తులో ఎదుర్కొన్న పరిణామాలను గమనిస్తే.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Viveka case
Viveka case

By

Published : Apr 17, 2023, 8:41 AM IST

Updated : Apr 17, 2023, 8:47 AM IST

YS Vivekananda Reddy murder case updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు.. నాలుగేళ్ల తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి.. దాదాపుగా కొలిక్కి వచ్చింది. సీబీఐ.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినా రోజు నుంచి అనేక రకాల బెదిరింపులను, దర్యాప్తు అధికారులపై పలు రకాల ఆరోపణలను, కేసులు నమోదు వంటి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. చివరికి వాటన్నింటినీ దాటుకుని ఆదివారం రోజున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసింది. అంతేకాదు, భాస్కర్ రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డిని సహ నిందితుడిగా చేర్చుతూ.. ఈరోజు విచారణకు హాజరుకావాలని నోటీలిచ్చింది. ఈ నెలాఖరుతో దర్యాప్తు పూర్తి చేస్తామని ఇటీవలే సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన సీబీఐ.. వీలైనంత త్వరగా వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియను ముగించేందుకు దర్యాప్తులో వేగం పెంచింది. అయితే, సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎటువంటి అవరోధాలను ఎదుర్కొంది..?, ఏయే అధికారులపై కేసులు నమోదు అయ్యాయి..?, సీబీఐ దర్యాప్తు చేస్తుండగా చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి..?, ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన డిమాండులు ఏంటి..?, వివేకా కుమార్తె చేసిన పోరాటాలు ఏంటి..?, అనే విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే.. సంచలన విషయాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

సాక్షిలో ‘నారాసుర రక్తచరిత్ర".. ఎన్నెన్నో అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు, ప్రభావితం చేయగల బలమైన వ్యక్తులు కల్పించిన ఆటంకాలు.. వీటన్నింటినీ దాటుకుని దాదాపు నాలుగేళ్ల తర్వాత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. అయితే.. హత్య జరిగినప్పటి నుంచి కేసు ఈ స్థితికి రావడానికి మధ్య అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. మొదటగా హత్య జరిగిన ఆ స్థలంలోని రక్తపు మరకల్ని తుడిచేసి, ఆధారాలను ధ్వంసం చేసి.. వివేకా హత్యను గుండెపోటుగా, సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారని సీబీఐ తేల్చింది. వివేకా హత్యకు గురయ్యారని అందరికీ తెలిసిపోయిన తర్వాత.. ఈ హత్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే చేయించారని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్‌ సొంత పత్రిక సాక్షిలో ‘నారాసుర రక్తచరిత్ర" అంటూ కథనాన్ని ప్రచురించి.. ఈ హత్యను చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు.

చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదని, వివేకా హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని.. అప్పట్లో వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు వైసీపీ ముఖ్యులందరూ డిమాండ్ చేశారు. వివేకా హత్యకు చంద్రబాబు, లోకేశ్‌ సూత్రధారులని.. అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆనాటి ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో హత్య చేయించారని ఆరోపిస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్‌.. సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. అనంతరం సీబీఐ దర్యాప్తును కోరుతూ 2019వ సంవత్సరం మార్చి నెలలో హైకోర్టులో జగన్ వ్యాజ్యం దాఖలాలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్య కేసుపై రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

మే 30న జగన్‌ సీఎంగా ప్రమాణం..2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక.. ఆ ఏడాది మే 30న జగన్‌ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను మార్చేశారు. ఆ సమయంలో కడప జిల్లాకు ఎస్పీగా ఉన్న అభిషేక్‌ మహంతి నేతృత్వంలో నూతన సిట్‌‌ను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకు అభిషేక్‌ మహంతి సెలవులో వెళ్లిపోయారు. అదే ఏడాది సెప్టెంబరులో కడప ఎస్పీ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో మరో సిట్‌ ఏర్పాటు చేసినా దర్యాప్తు ముందుకు సాగలేదు. సిట్‌ అధికారులను తరచూ మారుస్తుండటంతో దర్యాప్తు పక్కదారి పడుతుందన్న అనుమానాలతో.. సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వివేకా కుమార్తె సునీత వ్యాజ్యం వేశారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో పిటిషన్‌ వేసిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక సీబీఐ అవసరం లేదంటూ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌ ఆధారంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శ్హైరకోర్టు ) సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

కొన్ని రోజులకు దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ అధికారులకు.. తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. దర్యాప్తు వేగం పుంజుకుంటున్న కొద్దీ మరింత తీవ్రమయ్యాయి. వైకాపా నాయకులు, పోలీసులు, నిందితులు, నిందితుల తరఫువారు, అనుమానితులు అనేక అవరోధాలు సృష్టించారు. వివేకా హత్య కేసులో నిందితుడైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా... దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై గతేడాది ఫిబ్రవరి 18న పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆ F.I.Rపై స్టే వచ్చింది. సీబీఐ బృందం వెంటనే కడప నుంచి వెళ్లిపోవాలని, లేదంటే బాంబు వేసి పేల్చేస్తానంటూ.. ముసుగు ధరించిన ఓ వ్యక్తి తనను బెదిరించారని సీబీఐ అధికారుల వాహన డ్రైవర్‌ షేక్‌ వలీ బాషా గతేడాది మే నెలలో కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారిని అడ్డుకున్న అవినాష్‌ రెడ్డి.. తన ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డితో వైఎస్ అవినాష్‌ రెడ్డే వివేకానంద రెడ్డిని చంపించారన్న అనుమానాలు ఉన్నాయని.. సీబీఐ అభియోగపత్రంలో పేర్కొన్న తర్వాత.. దర్యాప్తు సంస్థకు మరిన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. శివశంకర్‌ రెడ్డి అరెస్టయ్యాక ఇంకా పెరిగాయి. ఒకానొక దశలో సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను కోర్టులోనే అవినాష్‌ రెడ్డి అడ్డుకున్నారు. మరో సందర్భంలో సీబీఐ అధికారుల బృందం కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు అవినాష్‌ రెడ్డి అనుచరులు యత్నించారు. శివశంకర్‌ రెడ్డి జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండగా.. మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే కడప సెంట్రల్‌ జైలు నుంచి రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆనాడు సాక్ష్యమిచ్చిన తనను తాడిపత్రి డీఎస్పీ చైతన్య వేధిస్తున్నారంటూ.. హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న జగదీశ్వర్‌ రెడ్డి సీబీఐకి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పటి పులివెందుల సీఐ J.శంకరయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. తర్వాత ఆయన తనకు తెలిసిన విషయాలతో 2021 సెప్టెంబర్ 28న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం నమోదుకు 2021 సెప్టెంబర్ 30న కోర్టులో సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అయితే సర్వీస్ అంశంపై కర్నూలు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల్ని కలవాల్సి ఉందని, బిజీగా ఉన్నానంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు శంకరయ్య నిరాకరించారు.

అనంతరం వారం రోజుల్లోనే 2021 అక్టోబర్ 6న ఆయనపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తేసింది. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి.. 2019వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన మరణించారు. శ్రీనివాసులు రెడ్డి మృతిని ఆనాటి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు..కానీ, ఇప్పటికీ ఏం జరిగిందో ఆ విషయాన్ని నిగ్గుతేల్చలేదు. వివేకా హత్య నేరాన్ని తనపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తానంటూ శివశంకర్‌ రెడ్డి ఆఫర్‌ ఇచ్చారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, ఆ తర్వాత మాట మార్చిన కల్లూరు గంగాధర్‌ రెడ్డి.. గతేడాది జూన్‌ 9న చనిపోయారు. దానిపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా.. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకేం జరిగినా వైసీపీ నాయకులదే బాధ్యత అంటూ.. కడప ఎస్పీకి, సీబీఐ అధికారులకు పదే పదే ఫిర్యాదులు చేశారు.

సుప్రీంకోర్టులో సునీత పిటిషన్‌ దాఖలాలు.. వివేకా హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల ఆటంకాలు కలుగుతున్నందున.. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో సునీత పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అధికారులపైనే క్రిమినల్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. సాక్షులకు తగినంత భద్రత కల్పించడం లేదని... పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో స్వేచ్ఛగా, న్యాయపరమైన విచారణ జరిగే అవకాశం కూడా కనిపించడం లేదని పేర్కొంది. వివేక హత్య కేసులో విస్తృతమైన ఆ కుట్రకోణాన్ని బయటికితీసేందుకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు కేసును బదిలీ చేస్తూ.. 2022వ సంవత్సరం నవంబరులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కొన్ని రోజులు గడిచాక సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలంటూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. రాంసింగ్‌ను తప్పించి కొత్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఏప్రిల్‌ 30 లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని.. కొత్త బృందం సుప్రీంకు నివేదించింది. ఆ కొత్త బృందం అధికారులే ఇప్పుడు భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేశారు. వారిపైనా అవినాష్‌రెడ్డి ఆరోపణలు చేశారు. పాత దర్యాప్తు అధికారుల తరహాలోనే వీళ్లు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వివేకా కుమార్తె సునీత, నిందితుడు దస్తగిరి, దర్యాప్తు అధికారి రాంసింగ్‌ కుమ్మక్కయ్యారని.. తాజాగా అరెస్టయిన భాస్కర్‌ రెడ్డి ఈ నెల 11న తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు అధికారి కోరినట్లే దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు.

వివేక హత్య కేసు..సీబీఐ అధిగమించిన అడ్డంకులు

ఇవీ చదవండి

Last Updated : Apr 17, 2023, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details