YS Sharmila Joined Congress Party: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం 'జగనన్న వదిలిన బాణం' అంటూ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. పార్టీ విజయానికి కృషి చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో అన్న జగన్‌కు దూరమయ్యారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
YSRCP Leaders Touch with Sharmila: ఈ నేపథ్యంలో తాజాగా షర్మిల ఆమె తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి దిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరకు జగనన్న వదిలిన బాణమే ఆయనకు అడ్డం తిరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితుల కారణంగా పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆమెతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాహుల్ గాంధీ సైతం జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ దక్కకపోయినా తర్వాత పార్టీ బలం పెంచుకోవచ్చనే ఆలోచనతో షర్మిలను పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది.
YS Sharmila Political Journey: వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు కీలక విషయాలు స్ఫురణకు వస్తాయి.షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‍రెడ్డి కుమార్తె. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆమె 2012-2013లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడైన షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి తరపున ఆమె ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు. అనంతరం రాష్ట్రానికి సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం, కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు.