YS Sharmila Congress Joining 2024 : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తమ పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహించారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిల హస్తం పార్టీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే పార్టీ విలీనంపై ఆమె నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంతా భావించినా అలాంటిదేమీ జరగలేదు.
ఈ సందర్భంగా అన్ని విషయాలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని షర్మిల పేర్కొన్నారు. తనతో కలిసి నడుస్తానన్న ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఆమె ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.
రేపు దిల్లీకి వైఎస్ షర్మిల - ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక! కాంగ్రెస్లో చేరడం ఖాయం - స్పష్టం చేసిన షర్మిల
సమావేశం అనంతరం షర్మిల కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి మహానేత నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రేపు దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలుస్తానని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని పేర్కొన్నారు. తమ మద్దతుతోనే తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వైఎస్ఆర్టీపీ బరిలో నుంచి తప్పుకోవడం వల్లే 31 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. కేసీఆర్ అరాచక పాలన అంతానికి తన వంతు కృషి చేశానని చెప్పారు. మరోవైపు తన కుమారుడి వివాహం సందర్భంగా తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి ఇడుపులపాయకు వచ్చానని షర్మిల చెప్పారు. రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.
షర్మిల ఇంట పెళ్లి సందడి - ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి వివాహం
కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నా. రేపు దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలుస్తా. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేం పోటీ చేయనందు వల్లే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. కేసీఆర్ అరాచక పాలన అంతానికి నా వంతు కృషి చేశా. రెండ్రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. - వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
అసెంబ్లీ ఎన్నికల్లో మేం పోటీ చేయనందువల్లే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ గెలిచింది : వైఎస్ షర్మిల
'బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం- అందుకే కాళేశ్వరం ఘటనపై కేంద్రం మౌనం'