తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐ అధికారులు అందుబాటులో లేరు.. మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు వస్తా' - kadapa cbi enquiry

YS Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్​ అవినాష్​రెడ్డి తండ్రి వైఎస్​ భాస్కర్​రెడ్డి ఇవాళ కడపలో సీబీఐ ముందుకు విచారణకు హాజరయ్యారు. అయితే భాస్కర్​రెడ్డి వచ్చే సమయానికి అధికారులెవరూ లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే వస్తానని తెలిపారు.

bhaskar reddy
bhaskar reddy

By

Published : Mar 12, 2023, 11:00 AM IST

Updated : Mar 12, 2023, 12:15 PM IST

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడపలో సీబీఐ విచారణకు వచ్చిన వైఎస్ భాస్కర్ రెడ్డి... విచారణ అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. వారం కిందట సీబీఐ అధికారులు నోటీస్ ఇచ్చిన మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి రావాలని తెలియ జేయడంతో భాస్కర్ రెడ్డి అదే సమయానికి ఇక్కడికి వచ్చారు.

పులివెందుల నుంచి భారీ సంఖ్యలో ఆయన వెంట వైఎస్సార్సీపీ శ్రేణుల కాన్వాయ్ తరలి రావడంతో జైలు వద్ద చాలా సేపు హడావుడి తోపులాట సాగింది. ఒక కానిస్టేబుల్ కింద పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది. న్యాయవాదితో విచారణ గదిలోకి వెళ్లిన భాస్కర్ రెడ్డి కాసేపటి తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

తాను విచారణకు వచ్చినా.. సీబీఐ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోతున్నారని తెలిపారు. మరోసారి నోటీస్ అందజేస్తామని అప్పుడు విచారణకు రావాలని చెప్పారని.. అందుకు అనుగుణంగానే బయటకు వెళ్లిపోతున్నట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యం సహకరించక పోయినా విచారణకు వచ్చానని కానీ ఇక్కడ దర్యాప్తు అధికారి అందుబాటులో లేరని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

వివేకా కేసు పరిష్కారం కావాలంటే హత్య జరిగిన రోజు లభ్యమైన లేఖను ఎందుకు దాచి పెట్టారో సిబిఐ అధికారులు వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టు చేస్తామని సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టుకు తెలిపిన వాటిపై స్పందించిన భాస్కర్ రెడ్డి దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

"నన్ను సీబీఐ వాళ్లు ఎంక్వైరీ కోసం సబ్ జైలు దగ్గరకి రమ్మనిచెప్పారు. నా ఆరోగ్యం బాగాలేక పోయినా.. వారి మాటలు గౌరవించి నేను విచారణకు హాజరయ్యాను. విచారణ ఎప్పుడు అన్నది మళ్లీ తెలియజేస్తాము అని సీబీఐ అధికారులు చెప్పారు. మిగతా విషయాలు అవినాష్ రెడ్డి గారు మీడియాతో చెప్పారు కాబట్టి నేను ఇంకేమీ చెప్పాలి అనుకోవట్లేదు. నాకు తెలిసిన విషయం ఒకటే చెప్తాను.. ఈ కేసు పరిష్కారం కావాలంటే ఆ లేఖ తప్ప వేరే మార్గమే లేదు". - వైయస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి

సుదీర్ఘ విరామానంతరం.. భాస్కర్ రెడ్డిని ఏడాది కిందట వరసగా రెండురోజుల పాటు పులివెందులలో సీబీఐ విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆదివారం విచారణకు పిలిచారు. గత నెల 23నే విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించినా.. వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. ఈ నెల 5వ తేదీన మరోసారి నోటీసులు అందజేసిన సీబీఐ అధికారులు.. ఈ నెల 12న కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారు. దీంతో భాస్కర్‌రెడ్డి కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చి పిలిస్తే.. వస్తానని భాస్కర్​ రెడ్డి తెలిపారు.

సీబీఐ కౌంటర్ అఫిడవిట్.. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్న సమయంలో భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలంలోనే ఉన్నారనేది సీబీఐ అభియోగం. వివేకా హత్యకు కుట్ర పన్నిన వారిలో అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటు భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, హత్యకు ముందు రోజైన మార్చి 14న ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. పథకం ప్రకారం భాస్కర్ రెడ్డి తన రెండు సెల్ ఫోన్లను స్విచాఫ్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయన్నది సీబీఐ భావన. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

కేసు పరిష్కారం అవ్వాలంటే.. ఆ లేఖ మాత్రమే మార్గం: వైయస్ భాస్కర్ రెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Mar 12, 2023, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details