తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానంలో వికృతచేష్టలు.. తప్పతాగి కెప్టెన్​ను కొట్టి.. ఎయిర్‌హోస్టస్‌ను లైంగికంగా వేధించి..

ఎయిర్​ఇండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన మరవకముందే.. మరో విమానంలో ప్రయాణికులు అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. మద్యం మత్తులో వారు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Assaulting Air hostess and Captain news
విమానం

By

Published : Jan 9, 2023, 11:28 AM IST

Updated : Jan 9, 2023, 11:34 AM IST

విమానాల్లో ప్రయాణికులు అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఘటనలు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్​ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా మరో విమానంలో ప్రయాణికులు తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఎయిర్‌హోస్టస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటమేగాక, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు. ఆదివారం రాత్రి దిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది.

ఈ విమానంలో ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో రచ్చరచ్చ చేశారు. ఫ్లైట్‌ అటెండెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని అడ్డుకునేందుకు కెప్టెన్‌ ప్రయత్నించగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో విమాన సిబ్బంది వీరి గురించి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. రాత్రి 10 గంటలకు విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వీరిలో ఇద్దరిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారవ్వగా అతడి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా బిహార్‌కు చెందినవారే. వీరికి రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) పార్టీతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు వీరు సన్నిహితులని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్​ఇండియా విమానంలో మహిళపై శంకర్‌ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నాడు. కాగా.. ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది అలసత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఘటన సమయంలో విమానంలో ఉన్న పైలట్‌, క్యాబిన్‌ సిబ్బందిపై వేటు వేసింది. దీనిపై టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ స్పందిస్తూ.. ఎయిరిండియా మరింత వేగంగా స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఈ సమస్యను తగిన రీతిలో మేం పరిష్కరించలేకపోయామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదేగాక, మరో ఎయిరిండియా విమానంలోనూ ఓ ప్రయాణికుడు.. తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Last Updated : Jan 9, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details