డ్రీమ్11 అనే క్రికెట్ గేమింగ్ యాప్‌తో రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు ఓ సామాన్య యువకుడు. దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న అతడి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
ఝార్ఖండ్‌కు చెందిన సుశీల్ కుమార్ అనే యువకుడు జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలోని పాంగి ప్రాంతానికి వలస వెళ్లాడు. అక్కడి రాష్ట్ర విద్యుత్తు బోర్డులో నాల్గో తరగతి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడి సోదరుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే సుశీల్ కుమార్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా డ్రీమ్11 క్రికెట్ గేమింగ్ యాప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి చిన్న మొత్తంలో మాత్రమే డబ్బులు వచ్చేవి.
కానీ, తాజాగా ఆడిన గేమ్‌లో సుశీల్ కుమార్ అక్షరాలా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తాను ఈ పెద్ద మొత్తం గెలిచేకన్నా ముందు ఆ సమయంలో సుమారు 35 లక్షల మంది ఈ ఆటను ఆడుతున్నారని సుశీల్ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అని కచ్చితమైన అంచనా వేయడం ద్వారానే ఇంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నట్లుగా సుశీల్ తెలిపాడు.
ఆన్లైన్ గేమ్‌లో గెలిచిన సొమ్మును తన తల్లిదండ్రులకు అందజేస్తానని సుశీల్ కుమార్ చెప్పాడు. ఇకపోతే వచ్చిన రూ.కోటి నగదు బహుమతిలో పన్ను మినహాయింపులు పోగా సుశీల్ చేతికి రూ.70 లక్షలు అందుతాయి. ఇంతకుముందు కూడా డ్రీమ్11 గేమింగ్ యాప్ ద్వారా హిమాచల్ ప్రదేశ్‌లో కొందరు ఇదే తరహాలో లక్షాధికారులు అయ్యారు.
డ్రీమ్11లో వచ్చిన రూ.2కోట్లతో.. ఏం చేశాడో తెలుసా..?
గతేడాది మే నెలలో కూడా జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు ఈ డ్రీమ్11 క్రికెట్ గేమింగ్ యాప్ ద్వారా ఏకంగా రూ.2 కోట్లను గెలుపొందాడు. అతడు ఎంచుకున్న టీమ్ నెగ్గడం ద్వారా ఇంత భారీ మొత్తాన్ని అతడు గెలుచుకున్నాడు. అయితే గెలిచిన ఈ సొమ్ముతో ఆ వ్యక్తి ఏం చేశాడో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
బెట్టింగులతో జాగ్రత్త సుమీ..
అయితే జూదం, బెట్టింగ్ వంటి పోకడలకు పోతే చివరకు అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కసారి వీటికి అలవాటైతే గనుక ఈ ఉచ్చులో నుంచి బయట పడటం మాత్రం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో డబ్బుపై వ్యామోహంతో పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో కూడా ఈ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. బెట్టింగుల్లో నష్టపోయిన యువత ఎంతటి మోసాలకైనా పాల్పడి తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.