దేశ రాజధాని దిల్లీలో క్రమక్రమంగా నేరాలు పెరుగుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో హత్యలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు.. నడిరోడ్డుపై కత్తితో దారుణంగా చంపారు. నాంగ్లోయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?..విశాల్ మాలిక్ అనే వ్యక్తి.. బైక్‌పై జిమ్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అతడి బైక్.. ఓ వాహన డ్రైవర్‌ను ఢీకొట్టింది. దీంతో విశాల్‌కు, వాహన డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆ డ్రైవర్ తరఫున వ్యక్తులు.. విశాల్‌పై దాడి చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విశాల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత విశాల్ తన సోదరుడు సాహిల్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపాడు. పోలీస్‌స్టేషన్‌కు రమ్మని కోరాడు.
అయితే పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సాహిల్‌ను.. విశాల్ బైక్ తెచ్చుకోమని పోలీసులు చెప్పారు. సాహిల్ ఒంటరిగానే ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్ తరఫున వ్యక్తులు.. సాహిల్పైన కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాహిల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాహిల్ మరణించాడని వైద్యులు తెలిపారు. సాహిల్ హత్యకు పోలీసులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.