కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో నిరసన వ్యక్తం చేసిన ఆ పార్టీ నేతల పట్ల దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌తో పోలీసులు దురుసుగా వ్యవహరించారు. నిరసన చేస్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో.. జుట్టు పట్టుకొని లాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాయి. పోలీసులు శ్రీనివాస్‌ను చుట్టుముట్టి ఓ వాహనంలోకి నెడుతుండటం వీడియోలో కనిపిస్తోంది. ఆయన మాత్రం వాహనంలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
'చర్యలు తీసుకుంటాం'
కాగా, పోలీసులు ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై దిల్లీ పోలీసులు స్పందించారు. అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.