ప్రియురాలి కోసం వచ్చిన ఓ యువకుడిని దారుణంగా కొట్టి, చంపారు ఆమె కుటుంబ సభ్యులు. అతడికి గుండు కొట్టించి, నోట్లో వస్త్రాలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. చనిపోయే వరకు చితకబాదారు. అనంతరం తమ ఇంట్లోకి రాత్రి ఓ దొంగ వచ్చాడని.. అతడ్ని పట్టుకుని కొట్టినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేహత్ కొత్వాలి పరిధిలోని మహోఖర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. దీనిపై శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. ఉత్తమ్, హరిలాల్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు.. నందు అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే యువకుడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.
నందుకు అదే గ్రామానికి చెందిన మహిళతో రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం ఉందన్న విషయం.. తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ తరచుగా కలుసుకునేవారని.. మహిళ ఇంటికి అప్పుడప్పుడు నందు వెళ్లేవాడని వెల్లడించారు. గురువారం రాత్రి కూడా నందుకు ఆ మహిళ ఫోన్ చేసిందని.. అనంతరం ఇంటికి రమ్మని పిలిచిందని వారు పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ ఇంటికి నందు వెళ్లాడని.. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి.. నందుపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.