తన ప్రేమను కాదన్నదని 23 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని కన్నూర్‌లో జరిగింది. కుటుంబసభ్యులు సమచారంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కన్నూర్‌కు చెందిన విష్ణుప్రియ అనే యువతిని కూతుపరంబాకి చెందిన శ్యామ్‌జిత్ అనే వ్యక్తి ప్రేమించమని ఒత్తిడి చేశాడు. నిరాకరించిన ఆ యువతిని హత్య చేయాలనుకున్నాడు. సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆమెను ఓ కంట కనిపెట్టాడు. కాసేపటికే ఆ యువతి డ్రెస్ మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు.. ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు.
ఇంటికి వెళ్లిన యువతి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి అనుమానంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె మెడతో పాటు చేతిపైన కత్తితో పొడిచిన గాయాలున్నాయని దర్యాప్తులో తేలింది. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ప్రారంభించారు.