తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2014 తర్వాత మేజిక్.. అదానీకి జాక్​పాట్​'.. రాహుల్​ పంచ్.. భాజపా ఫైర్

దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతోందని.. ఆయన అన్ని రంగాల్లో ఎలా రాణించారని తనను భారత్ జోడో యాత్రలో చాలా మంది ప్రశ్నించారని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ-అదానీ మధ్య సంబంధమేంటో తెలియాల్సి ఉందన్నారు. 2014లో 8 బిలియన్​ డాలర్లు ఉన్న అదానీ ఆదాయం.. 2022లో 140 బిలియన్​ డాలర్లుకు ఎలా చేరుకుందని తనను అనేక మంది ప్రశ్నించారని లోక్​సభలో వెల్లడించారు రాహుల్. ఈ ఆరోపణలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

rahul gandhi on adani
rahul gandhi on adani

By

Published : Feb 7, 2023, 3:32 PM IST

Updated : Feb 7, 2023, 9:48 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ గ్రూప్​ అధినేత గౌతమ్ అదానీ మధ్య సంబంధమేంటో తెలియాల్సి ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మంగళవారం లోక్​సభలో మాట్లాడిన ఆయన.. దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతోందని.. ఆయన అన్ని రంగాల్లో ఎలా రాణించారని తనను భారత్​ జోడో యాత్రలో చాలా మంది ప్రశ్నించారని చెప్పారు. 2014లో 8 బిలియన్​ డాలర్లు ఉన్న అదానీ ఆదాయం.. 2022లో 140 బిలియన్​ డాలర్లుకు ఎలా చేరుకుందని తనను అనేక మంది అడిగారని తెలిపారు. దేశీయ విమానాశ్రయాల్లో అదానీ వాటా పెరుగుతోందని.. కాంట్రాక్టులన్నీ అదానీకి అప్పగించడమేనా భారత్ పాలసీ అని ప్రశ్నించారు. దేశంలోనే ఎక్కువ ఆదాయం కలిగిన ముంబయి విమానాశ్రయాన్ని జీవీకే సంస్థ నుంచి లాక్కుని .. ప్రభుత్వమే అదానీకి అప్పగించిందని విరుచుకుపడ్డారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక మేజిక్ జరిగి.. అదానీకి జాక్​పాట్​ తగిలిందని ఎద్దేవా చేశారు రాహుల్​. అందుకే ప్రపంచ కుబేరుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న అదానీ.. రెండో స్థానానికి చేరుకున్నారని చెప్పారు.

"ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. వీరి (మోదీ-అదానీ) బంధం ప్రారంభమైంది. 2014లో మోదీ దిల్లీకి వచ్చిన తర్వాత అసలు మోసం మొదలైంది. విమానాశ్రయ నిర్మాణంలో ముందస్తు అనుభవం లేని వారు ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిలో భాగస్వాములు కారాదన్న నియమం ఉంది. ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసి.. అదానీకి ఆరు విమానాశ్రయాలను అప్పగించింది. జీవీకే సంస్థలపైకి సీబీఐ, ఈడీని ప్రయోగించి.. వారిపై ఒత్తిడి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వారి చేతిలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లను అదానీకి అప్పగించింది. వ్యక్తిగత వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలో ఇది నిదర్శనం."

--రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే భారత్ జోడో యాత్ర చేశానని చెప్పారు రాహుల్​. పాదయాత్రలో ఎంతోమంది ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారని తెలిపారు. ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలే ప్రధానంగా ఉన్నాయని.. కానీ రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి మాట్లాడలేదని విమర్శించారు. పాదయాత్రలో ఎంతో మంది నిరుద్యోగులు తనను కలిశారని.. వారిని ఏం చదివారు? ఏం చేస్తున్నారని అడగగా.. ఇంజినీరింగ్‌ చదివి కూడా ఉబర్‌ కార్లు నడుపుతున్నామని చెప్పారని వివరించారు. గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని ఆరోపించారు. అగ్నివీర్‌ గురించి యువకుల్లో నిర్లిప్తత కనిపించిందని.. ఈ పథకాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ విధానంగా భావిస్తున్నారని మండిపడ్డారు.

"ప్రధాని మోదీ ఒత్తిడితోనే శ్రీలంకలో నిర్మితమవుతున్న పవర్​ ప్రాజెక్ట్​.. అదానీకి అప్పగించామని ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స చెప్పారు. భారత దేశ విదేశాంగ విధానం ఇది కాదు. మోదీ ఆస్ట్రేలియా వెళ్లగానే.. ఎస్​బీఐ బిలియన్​ డాలర్ల రుణం ఇచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్లగానే.. ఆ దేశ విద్యుత్ అభివృద్ధి సంస్థ అదానీతో 25 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజుల క్రితం హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వచ్చింది.అదానీకి భారత్‌ వెలుపల షెల్‌ కంపెనీలు ఉన్నాయని అందులో ఉంది. ఈ షెల్‌ కంపెనీలు వేలాది కోట్ల రూపాయలను భారత్‌లోకి పంపుతున్నాయి. ఇవి ఎవరి డబ్బులు? ఈ పనిని అదానీ ఉచితంగా చేస్తున్నారా? భారత్‌లోని పోర్ట్స్‌లో అదానీ ఆదిపత్యం చెలాయిస్తారు. విమానాశ్రయాల్లోనూ అదానీదే ఆదిపత్యం. భారత రక్షణ రంగంలోనూ అదానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తికి షెల్‌ కంపెనీలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదు. అదానీ సంస్థలు వ్యూహాత్మక రంగంలో పనిచేస్తున్నాయి. అయినా వాటి గురించి మీకు ఏమీ తెలియదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. అయినా మీకు తెలియదు ."

--రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ

'ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి'
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు స్పందించారు. అదానీ వ్యవహారంలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను.. ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు.

రాహుల్​పై విరుచుకుపడ్డ భాజపా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది. మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు భాజపా సీనియర్​ నేత రవి శంకర్​ ప్రసాద్​. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఆయన బయట మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ అనేక భారీ కుంభకోణాల్లో భాగస్వామి అయి, భారతదేశ ప్రతిష్ఠను మంటగలిపిందని విరుచుకుపడ్డారు. రాహుల్​ గాంధీ తన అవినీతి చరిత్రను గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాహుల్​ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా ముగ్గురూ బెయిల్​పైనే ఉన్నారని విమర్శించారు రవి శంకర్ ప్రసాద్. రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర మొత్తం అవినీతిమయని ఆరోపించారు. కాంగ్రెస్​ అవినీతి చేయడం, అవినీతి పరులను కాపాడడమనే రెండు స్తంభాలపైన నిర్మితమైందని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :ఆమె పెళ్లికి శ్మశానమే కల్యాణ మండపం.. ఎందుకో తెలుసా..?

అర్ధరాత్రి హైవేపై ప్రమాదం.. బాడీ పైనుంచి దూసుకెళ్లిన కారు.. 11కి.మీ అలానే ఈడ్చుకెళ్లాక..

Last Updated : Feb 7, 2023, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details