Youngest Organ Donor In India : తమ కుటుంబంలోకి చిన్నారి రాబోతుందంటూ ఎంతో ఆనందపడ్డారు. 9నెలలుగా ఎన్నో ఆశలతో ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. పుట్టిన చిన్నారి బ్రెయిన్ డెడ్ కావడం వల్ల శోక సంద్రంలో మునిగిపోయారు. దాని నుంచి తేరుకుని మంచి మనసుతో చిన్నారి అవయవాలు దానం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో దేశంలోనే అత్యంత చిన్న వయసులో ఆర్గాన్ డోనర్‌గా నిలిచింది గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన చిన్నారి.
ఇదీ జరిగింది
సూరత్‌లోని వాలక్ పఠియాకు చెందిన సంఘాని కుటుంబంలో అక్టోబర్ 13న ఓ బాలుడు జన్మించాడు. దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. పుట్టిన బిడ్డ అచేతనంగా ఉన్నాడని.. కనీసం ఏడవడం లేదని చెప్పారు వైద్యులు. దీంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. మెరుగైన చికిత్స కోసం చిన్నారిని వెంటనే పిల్లల వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లారు. చిన్నారిని వెంటిలేటర్‌పై పెట్టినా.. ప్రయోజనం లేకపోయింది. న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్తో కూడిన వైద్య బృందం.. చిన్నారిని నిరంతరం పరీక్షించింది. అయినా.. చిన్నారిలో ఎలాంటి మార్పు రాకపోవడం వల్ల బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు వైద్యులు. 9 నెలలుగా ఎన్నో కలలు కన్న ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కిడ్నీలు, కళ్లు, లివర్ దానం
అయితే, ఈ విషయాన్ని తెలుసుకున్న జీవన్‌దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు.. సంఘాని కుటుంబాన్ని సంప్రదించారు. అవయవ దానం ప్రాముఖ్యాన్ని వారికి చెప్పి ఒప్పించారు. కుటుంబ సభ్యులు అంగీకారంతో చిన్నారికి పరీక్షలు చేశారు వైద్యులు. అనంతరం చిన్నారి నుంచి కిడ్నీలు, కళ్లు, లివర్‌ను సేకరించారు.