మహారాష్ట్ర అమరావతిలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అచల్‌పుర్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరింది. ప్రస్తుతం ఆ యువతి గర్భవతి. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు సమాచారం ప్రకారం..ఆ యువతిని సెప్టెంబరు 22న అర్ధరాత్రి 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయంపై ఆమె బంధువులు పోలీసులకు సెప్టెంబరు 23న ఫిర్యాదు చేశారు. దుండగులు ఆ యువతిని పావ్నే ప్రాంతం నుంచి ఎత్తుకెళ్లి తెలియని ప్రదేశంలో మూడు నెలలపాటు ఉంచి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు డిసెంబరు 14న తన ఇంటికి చేరింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది.
యువతిని చికిత్స కోసం అచల్‌పుర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని తేలింది. దీంతో డాక్టర్ ఆమె వద్ద వాంగ్మూలాన్ని తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువతి మిస్సింగ్ గురించి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పలేదు. పరువు పోతుందనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆ విధంగా చేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే ఆ యువతి నుంచి డాక్టర్ పూర్తి సమాచారం తీసుకుని పోలీసులకు సమాచారం అందించిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు.