కర్ణాటకలో దావణగెరెలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నడిరోడ్డు మీద కొట్టుకున్నారు. ఓ యువతి.. మరో యువతిపై రేడియం కట్టర్తో దాడి చేసింది. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఇద్దరు యువతులు చాలా సన్నిహితంగా ఉండేవారు. వారి బంధం.. స్వలింగ సంపర్కానికి దారితీసింది. ఇటీవలే వారిద్దరిలో ఓ యువతి.. తన స్నేహితురాలితో ఎక్కువగా ఫోన్ మాట్లాడింది. అందుకు కోపం పెంచుకున్న మరో యువతి.. ఆమెపై రేడియం కట్టర్తో దాడి చేసింది. దీంతో ఆమె మెడ, చేతికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దాడి చేసిన యువతి.. తన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు వారిద్దర్నీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు యువతులు చికిత్స పొందుతున్నారు.
ఆన్లైన్ రమ్మీ కోసం దొంగగా మారిన పోలీస్..
కేరళలోని కొచ్చిలో ఆర్మీ రిజర్వ్ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అధికారి.. తన స్నేహితుడి ఇంట్లో బంగారం దొంగిలించినందుకు అరెస్టయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 13న నిందితుడు అమల్ దేవ్.. తన స్నేహితుడు నటేశన్ ఇంట్లో పది సవర్ల బంగారాన్ని దొంగలించాడు. ఈ క్రమంలో నటేశన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. అమల్దేవ్పై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ జరిపారు. ఈ క్రమంలో అమల్ దేవ్.. నేరం చేసినట్లు పోలీసులు ఎదుట అంగీకరించాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడేందుకు బంగారాన్ని దొంగతనం చేసినట్లు పోలీసులకు అమల్ దేవ్ తెలిపాడు.
తొమ్మిదేళ్ల కూతురిపై తండ్రి రేప్..
రాజస్థాన్లో అల్వార్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల కన్నకూతురిపై ఆమె తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం..నాలుగురోజుల క్రితం 9 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని 198కి సమాచారం అందింది. వెంటనే అధికారులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఏం జరిగిందో ఆరా తీశారు. అయితే బాలిక ప్రైవేట్ భాగంలో గాయమైందని.. కుట్లు వేయించారని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటనలో వైద్యుడి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని, దర్యాప్తు చేపడుతున్నామన్నారు.