మాయదారి మనుషుల కన్నా కృత్రిమ మేధతో నడిచే వ్యవస్థలపైనే మాకు విశ్వాసం అంటోంది నేటి యువత. రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయని, సమాజంలోని విభజనలకు అవే కారణమని కుండబద్దలు కొడుతోంది. దీనికి పరిష్కారం యువ గళాలకు తాళాలు వేయకుండా వారికి విధాన రూపకల్పనలో పెద్దపీట వేయడమే అని చెబుతోంది. 'యువత సారథ్యంలో సమాజ పునర్నిర్మాణ ప్రణాళిక' పేరుతో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఓ నివేదికను సిద్ధం చేసింది. భారత్ సహా వివిధ దేశాల్లో 20 లక్షల మందికిపైగా యువత నుంచి అభిప్రాయాలను ఇందులో క్రోడీకరించింది. సమాజం, ప్రభుత్వం, వృత్తి జీవితం తదితర అంశాల్లో ఎలాంటి భవిష్యత్తు కోరుకుంటున్నారన్న విషయాన్ని ప్రధానంగా ఆరా తీసింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గురువారం దీన్ని విడుదల చేసింది. కీలకాంశాలివి..
- ప్రపంచంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. పర్యావరణ సమస్యలు, ఆర్థిక అసమానతలకు రాజకీయ విధానాలే ప్రధాన కారణం. అవినీతి, మూస రాజకీయ నాయకత్వాలకు ముగింపు పలకాలి.
- పరిపాలనలో యువత భాగస్వాములు కావడానికి, విధాన రూపకర్తలుగా ఎదగడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టి, గణనీయంగా నిధులు కేటాయించాలి.
- వాతావరణ మార్పులను అరికట్టడానికి కొత్తగా చమురు, బొగ్గు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతను నిలిపివేయాలి.
- హక్కుల కార్యకర్తలపై సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిఘా, సైనిక, పోలీసు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. జీవిత భద్రత ప్రమాదంలో పడింది.
- సర్వేలో పాల్గొన్న సగం మంది తమకు సరైన నైపుణ్యాలు లేవని భావిస్తున్నారు. పావు వంతు మంది అత్యవసర వైద్య ఖర్చులు వస్తే అప్పులపాలు అవుతామని భయపడుతున్నారు.
- స్వేచ్ఛాయుత అంతర్జాల హక్కు అత్యవసరం. ఇంటర్నెట్ సేవల అడ్డగింత, దుర్వినియోగాన్ని అరికట్టాలి.
- మానవ నియంత్రిత వ్యవస్థల కన్నా కృత్రిమ మేధ ఆధారంగా నడిచేవాటిపైనే విశ్వాసమెక్కువ.
- ముందు తరం వారు అనుభవించినంత మెరుగైన జీవనశైలి తమకు దక్కుతుందన్న నమ్మకం లేదు. ఆర్థిక భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 50 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.372కోట్లు) మించిన ఆస్తులపై ప్రపంచ ఆదాయ పన్ను విధించాలని సూచిస్తున్నారు. తద్వారా పనిచేసే యువతపై భారం తగ్గుతుందని, ఆర్థిక అసమానతలు తగ్గుతాయని చెబుతున్నారు.