ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అతడి మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికారు. మృతుడి శరీర భాగాలను అతడు నివాసం ఉంటున్న ఇంట్లోనే.. పాలిథీన్ కవర్లలో కుక్కి పారిపోయారు. ఒడిశాలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని రింకు మెహర్గా పోలీసులు గుర్తించారు. బుధవారం దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోలింగర్ జిల్లాలోని సలేపలి ప్రాంతంలో రింకు హత్యకు గురయ్యాడు. రింకు తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి.. సలేపలిలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. 20 రోజుల క్రితం రింక్ తన తల్లిదండ్రులను దారుణంగా కొట్టాడు. దీంతో వారు విషమ పరిస్థితుల్లో స్థానిక ఆసుపత్రిలో చేరారు. రింకు తమ్ముడు కూడా తల్లిదండ్రులకు సహాయంగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. దీంతో రింకు ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. బుధవారం రింకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. అనంతరం తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. రింకు శరీర భాగాలు 7 సంచుల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే యువకుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నిందితులు నరికి ఉంటారని వారు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వారు తెలిపారు.