చండీగఢ్‌లోని బుడేల్లో ఘోరం జరిగింది. 18 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు బిహార్‌కు చెందిన మహ్మద్ షరీక్(25)గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని సెక్టార్- 43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలు, నిందితుడు ఎదురెదురు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మృతురాలి తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. యువతి తండ్రి.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్నాడు. నవంబర్ 19న యువతి సోదరుడు ఇంటికి వచ్చే చూసేసరికి ఆమె మంచంపై అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. నిందితుడు ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా బాలికను తనతో శారీరక సంబంధం పెట్టుకోమని వేధించేవాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో..
హరియాణా నుహ్‌లోని ఖేడాలో ఘోరం జరిగింది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మహిళ అరుపులు విన్న స్థానికులు.. ఆమెను బావిలో నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.