YOUNG MAN SET RECORD IN BLIND FOLD SUDOKU: వార్తాపత్రికల అనుబంధాల్లో వచ్చే పజిల్స్ పూర్తి చేయడం చిన్నప్పటి నుంచి అతనికి చాలా ఇష్టమైన పని. అలా దానిపై ఉన్న ఇష్టంతో క్రమంగా వాటి గురించి మరింత సాధన చేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో 5 రికార్డులు బద్దలు కొట్టి ఔరా అనిపించాడు.
కళ్లకు గంతలు కట్టుకుని సుడోకు చేస్తున్న ఈ యువకుడి పేరు జశ్వంత్ సున్హిత్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం. తల్లిదండ్రులు.. రేణుకాదేవి, చంద్రమోహన్. పదో తరగతి వరకు సొంత ఊరిలోనే చదువుకున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే పజిల్స్, సుడోకూలు చేయటంపై దృష్టి సారించేవాడు.
"చిన్నప్పుడు మా అత్తయ్య రమాదేవి సుడోకు నేర్పించారు. గ్రాడ్యుయేషన్ టైంలో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లో వచ్చే వాటిని కట్ చేసి ఖాళీ సమయాల్లో చదివే వాడిని. అదే అలవాటు ప్రకారం ఓసారి సుడోకుని కట్ చేసి క్లాస్ రూంలో ట్రై చేశా. మా తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సహంతో ఇంతవరకూ రానిచ్చా"-జశ్వంత్ సున్హిత్
సహజంగా సుడుకోను చూస్తూ అందరూ పరిష్కరిస్తారు. కానీ, పూర్తి ఏకాగ్రతతో ఒకసారి చూసి కళ్లకు గంతలు కట్టుకుని పూర్తి చేయడం కష్టం. మనోడు మాత్రం అవలీలగా చేసేస్తున్నాడు. 6నిమిషాల 32 సెకన్లలో సుడోకును పూర్తి చేసి కర్ణాటక అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకున్నాడు.
"బ్లైండ్ ఫోల్డ్ సుడోకుని నేను 6నిమిషాల 32సెకన్స్‌లో కంప్లీట్ చేశా. ఇండిపెండెంట్ విట్నెస్ ,రాండమ్ సుడోకు చూపిస్తారు. సుడోకులో 9 రోస్, 9కాలమ్స్ ఉంటాయి. వాటన్నంటిని నేను 6నిమిషాల 32సెకన్స్‌లో పూర్తి చేయడం వల్ల అన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు నన్న అప్రిషియేట్ చేసి వరల్డ్ రికార్డు హోల్డర్‌గా గుర్తించారు. సుడోకు మాత్రమే కాకుండా బ్లైండ్ ఫోల్డ్ చెస్ కూడా ఆడగలను"-జశ్వంత్ సున్హిత్