తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కులం, మతం లేని ధ్రువపత్రం.. ఆదర్శంగా నిలిచిన దంపతులు - కులం మతం లేని ధ్రువీకరణ పత్రం

కులం, మతం లేని ధ్రువపత్రాన్ని తీసుకున్నారు తమిళనాడులోని దంపతులు. వారి పిల్లలకు సైతం కులం, మతం లేని ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

no religion no caste certificate
కులం, మతం లేని ధ్రువీకరణ పత్రంను పొందిన కార్తికేయన్ దంపతులు

By

Published : Jun 26, 2022, 2:27 PM IST

తమిళనాడులోని ఓ జంట చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని తెవర్​కులం పంచాయతికి చెందిన కార్తికేయన్​, షర్మిల దంపతులు.. తమకు కులం, మతం లేని ధ్రువపత్రాలు కావాలని అక్కడి తాహసీల్దార్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చూసి అధికారులు షాక్​ అయ్యారు.

కులం, మతం లేని ధ్రువీకరణ పత్రంను పొందిన కార్తికేయన్

కులం, మతం లేని ధ్రువపత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో ఎవరికీ జారీ చేయడం లేదని తెలిపారు అధికారులు. కానీ దరఖాస్తుదారుడు కార్తికేయన్ అందుకు అంగీకరించలేదు. తమిళనాడులో ఇప్పటివరకు ఆరుగురికి ఇటువంటి ధ్రువపత్రాలు జారీ చేశారని ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కార్తికేయన్​ చెప్పడం వల్ల అధికారులు ధ్రువపత్రాన్ని అందించారు.

"నా స్వస్థలం శివకాశి. కొన్నేళ్ల క్రితం కులం, మతం లేని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పిటిషన్‌ వేశాను. కానీ అప్పటి అధికారులు ధ్రువపత్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు నేను సర్టిఫికేట్ పొందడానికి అవసరమైన ఆధారాలను సేకరించడం ప్రారంభించి ధ్రువపత్రాన్ని పొందాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు నేసన్ (4), కరికాలన్ (2) వారికి కూడా కులం, మతం లేని సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాం."

-కార్తికేయన్

ఇటువంటి ఘటనే మరోటి తమిళనాడులో కొంతకాలం క్రితం వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూర్​కు చెందిన ఆ దంపతులు కులం, మతం లేని ధ్రువపత్రాన్ని పొందారు. తమ కుమార్తెను ఎవరూ కుల, మతం పరంగా చూడకూడదని.. కేవలం ప్రేమతోనే చూడాలని భావించిన తల్లిదండ్రులు.. ఆమెకు అరుదైన ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. నరేశ్‌ విజయ్‌, గాయత్రి దంపతులకు మూడున్నరేళ్ల పాప ఉంది. తమ కుమార్తె విమ్లాను పాఠశాలలో చేర్పించాలని భావించిన వారు.. పలు స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అడ్మిషన్‌ ఫామ్‌లోని కులం, మతం కాలమ్‌లను నింపకుండా ఖాళీగా వదిలేశారు. కానీ ఆ కాలమ్‌లను కచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందని, లేదంటే అడ్మిషన్‌ ఇవ్వలేమని ఆయా స్కూళ్లు స్పష్టం చేశాయి.

పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదని 1973 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలియని బాలిక దంపతులు.. తమ సమస్యను పరిష్కరించాలంటూ కోయంబత్తూర్‌ జిల్లా కలెక్టర్‌ జి.ఎస్‌.సమీరన్‌ను సంప్రదించారు. తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ 1973, 2000 నాటి రెండు వేర్వేరు ఉత్తర్వుల ప్రకారం.. 'కులం లేదు, మతం లేదు' అని తల్లిదండ్రులు చెబితే కులం, మతం కాలమ్‌లను ఖాళీగా ఉంచవచ్చు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ సమీరన్‌ ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు. కానీ రిజర్వేషన్‌ పరంగా ప్రభుత్వం నుంచి పొందే పథకాలు, వెసులుబాటులు అందబోవని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:కూతురి కోసం 'కులం లేని ధ్రువపత్రం'... తల్లిదండ్రుల ఆదర్శం..

'దాగుడుమూతలు' ఆడుతూ బాలుడు మాయం.. ఏడాది తర్వాత ఫేస్​బుక్​ సాయంతో..

ఆ డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. అధికారులే షాక్​!

ABOUT THE AUTHOR

...view details