ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమ లోకంలో విహరించారు. అయితే, వారి ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో కలత చెందారు. ఒకరినొకరు విడిచి బతకలేమని నిశ్చయించుకున్నారు. ఒకే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్ జిల్లాలో గురువారం జరిగింది.
జిల్లాలోని కొలజ్హోర్ గ్రామంలో పొలాల సమీపంలో చెట్టుకు వేళాడుతున్న మృతదేహాలను గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
"గ్రామస్థుల సమాచారం మేరకు వీరిద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. వీరి వయసు 20-22 మధ్య ఉండొచ్చు. మరణానికి సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్లు దొరకలేదు. ఈ ఘటనలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. "