ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య సరదాగా జరిగిన ఓ మొబైల్ చాటింగ్ సంభాషణ.. 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. అదేంటీ.. విమానం ఆలస్యమవ్వడానికి ఆ చాటింగ్‌కు సంబంధం ఏంటనుకుంటున్నారా? అయితే ఇది చదవండి..!
ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నిన్న మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అబ్బాయి ముంబయి వెళ్లేందుకు.. అమ్మాయి బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ముంబయి వెళ్లే విమానం రాగానే అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. అమ్మాయేమో తన విమానం కోసం ఎదురుచూస్తోంది. బోర్ కొడుతుంది అనుకున్నారేమో ఇద్దరూ మొబైల్‌లో చాట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాకుంటూ 'నువ్వే ఓ బాంబర్' అంటూ ఆ అమ్మాయి.. అబ్బాయికి మెసేజ్ చేసింది.
ఆ మెసేజ్ సరిగ్గా విమానంలో అబ్బాయి వెనుక సీట్లో కూర్చున్న తోటి ప్రయాణికురాలి కంట్లో పడింది. దీంతో భయాందోళనకు గురైన ఆ ప్రయాణికురాలు వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ దించేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కన్పించలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.