Yogi Adityanath Takes Oath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భాజపాను గెలిపించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇకానా క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ సహా హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకుర్.. పార్టీ సీనియర్లు, పారిశ్రామిక వేత్తల మధ్య యూపీకి వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు ఆదిత్యనాథ్. కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
గురువారం సాయంత్రం లఖ్‌నవూలో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో సీఎంగా యోగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగిని కోరారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆదిత్యనాథ్. ప్రమాణస్వీకారానికి ముందు.. పలు ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుల్డోజర్లకు హారతి పట్టారు. కొందరు భాజపా మద్దతుదారులు 'బుల్డోజర్ బాబా జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.