Yogi Adityanath ETV Bharat interview: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మూడు విడతలు పూర్తయ్యాయి. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు భాజపా ఎలాంటి అవకాశాలను విడిచిపెట్టడం లేదు. కేంద్ర అధినాయకత్వంతో పాటు, ప్రధానమంత్రి, సీనియర్ నేతలు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తిరిగి భాజపాను అధికారంలోకి తెచ్చే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. రాత్రింబవళ్లు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో ఈటీవీ భారత్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు యోగి. ఎన్నికల్లో భాజపా సాధించనున్న సీట్లు, సమాజ్‌వాదీ ప్రభావం, హిజాబ్ వివాదంపై మాట్లాడారు. ఆ వివరాలు ఇలా...
Yogi Adityanath UP Election:
మూడు దశల ఎన్నికల తర్వాత భాజపా ఏ స్థితిలో ఉంది?
UP assembly election 2022:జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన అనేది భాజపా అజెండా. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాల కోసం భాజపా పనిచేస్తుందని ప్రజలకు తెలుసు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికలను పరిశీలిస్తే ప్రజలు భాజపా పక్షానే ఉన్నారని స్పష్టమవుతోంది.
అహ్మదాబాద్ పేలుళ్ల ఘటన నిందితుడి తండ్రి సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి?
సమాజ్‌వాదీ పార్టీ చరిత్ర చాలా దుర్భరంగా ఉంది. 2013లో ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు కాపాడటం కోసమే సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం పనిచేసిందని చరిత్రే చెబుతుంది. రాష్ట్రంలో గూండాలు, మాఫియాకు సురక్షిత ఆశ్రయం కల్పించింది. ఎస్పీ చరిత్ర అందరికి తెలుసు.
మూడు రోజుల క్రితం గుజరాత్ కోర్టు వరుస పేలుళ్ల ఘటనపై తీర్పు వెలువరించింది. 38 మంది దోషులకు ఉరి శిక్ష, 11మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అందులో 9మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఉగ్రవాదుల్లో చాలా మంది ఆజంగఢ్‌లోని సంజార్పుర్ గ్రామానికి చుట్టుపక్కలే ఉంటున్నారు.
సంజార్పుర్కు చెందిన ఓ ఉగ్రవాది సిరియాకు పారిపోయాడు. దిల్లీ బాట్లాహౌస్ ఘటనలో అతడి సోదరుడికి ప్రమేయం ఉంది. సిరియా పారిపోయిన ఉగ్రవాది తండ్రి ఎస్పీకి క్రియాశీల కార్యకర్త. ఆ పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నాడు. చిన్నాపెద్దా ఘటనలన్నింటికీ స్పందించే అఖిలేశ్ యాదవ్.. 2013 ఘటన(ముజఫర్‌నగర్ అల్లర్లు)పై ఎందుకు మౌనంగా ఉన్నారు?
మాఫియాపై తీసుకున్న చర్యలను విమర్శిస్తూ మిమ్మల్ని 'బుల్డోజర్ బాబా' అని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. దీనిపై మీరేమంటారు?
రాష్ట్రంలో సమాజ్‌వాదీ నాలుగు సార్లు అధికారంలో ఉంది. పేద ప్రజలు, యువత, రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలిగేలా వారు ఎలాంటి పని చేయలేదు. ఇది దురదృష్టకరం. కానీ, ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరితో ఉండటం ఆశ్చర్యం.
ఎస్పీ పాలనలో నేరస్థులు, మాఫియాకు భయమే లేకుండా పోయింది. మేం అధికారంలోకి వచ్చాక చెప్పింది చేశాం. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకున్నాం. అభివృద్ధి, భద్రత అంశాలపై ఎలాంటి రాజీ లేకుండా భాజపా ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంది.