తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యోగి కేబినెట్‌లో కలకలం.. మంత్రి రాజీనామా.. మరొకరు దిల్లీకి.. - యోగి ఆదిత్యనాథ్‌ తాజా వార్తలు

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఒక మంత్రి రాజీనామా చేయగా.. భాజపా పెద్దలను కలుసుకునేందుకు మరొక మంత్రి దిల్లీకి వెళ్లారు.

యోగి
యోగి

By

Published : Jul 21, 2022, 4:09 AM IST

Updated : Jul 21, 2022, 6:46 AM IST

Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఒక మంత్రి రాజీనామా చేయగా.. భాజపా పెద్దలను కలుసుకునేందుకు మరొక మంత్రి దిల్లీకి వెళ్లారు. భాజపా ప్రభుత్వాల్లో ఇలా సొంత నేతల నుంచే బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం కావడమనేది అరుదనే చెప్పాలి. అలాంటిది వరుసగా మూడు శాఖల మంత్రులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. జలశక్తి శాఖ మంత్రి అయితే ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాజీనామా లేఖను పంపి, అవినీతి ఆరోపణలు చేశారు.

'నా సామాజిక వర్గం కారణంగా నాకు గౌరవం దక్కడం లేదు. ఒక మంత్రిగా నాకు ఎలాంటి అధికారం లేదు. నేను మంత్రిని కాబట్టి నాకో కారు ఇచ్చారు. నన్ను ఏ సమావేశానికి పిలవడం లేదు. నాకు ఏ పని అప్పగించడం లేదు. బదిలీల్లో అవినీతి చోటుచేసుకుంది. దాని గురించి అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. నా శాఖ కార్యదర్శి నా మాట వినడం లేదు. నమామీ గంగ పథకంలో కూడా అవినీతి చోటుచేసుకుంటోంది. ఇవన్నీ నన్ను బాధకు గురిచేశాయి' అని ఆరోపిస్తూ జలశక్తి మంత్రి దినేశ్ కార్తీక్ రాజీనామా సమర్పించారు.

మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జితిన్ ప్రసాద కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాపనుల శాఖలో జరిగిన బదిలీల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఐదుగురు సీనియర్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అందులో జితిన్ ప్రసాద ఓఎస్‌డీ కూడా ఉన్నారు. దానిపై జితిన్ ముఖ్యమంత్రిని కలిశారు. అలాగే దిల్లీలోని భాజపా నాయత్వాన్ని కలిసేందుకు వెళ్లారు. అంతకుముందు యూపీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అయిన బ్రజేశ్ పాథక్‌ తన నిరసన గళాన్ని వినిపించారు.
ఈ పరిణామాలపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ స్పందించారు. 'భాజపా ప్రభుత్వ అవినీతి వరుస క్రమాన్ని గమనించండి. మొదట ప్రజాపనుల విభాగం, తర్వాత ఆరోగ్య శాఖ, ఇప్పుడు జల శక్తి శాఖ. తర్వాత ఎవరని ప్రజలు అడుగుతున్నారు' అంటూ విమర్శలు చేశారు.

ఇదీ చదవండి :'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు

Last Updated : Jul 21, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details