Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు అధికార పర్యటనలకు వెళ్తే హోటళ్లకు బదులుగా అతిథి గృహాల్లోనే బసచేయాలని ఆదేశించిన ఆయన.. తాజాగా మరోసారి వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ప్రకటించాలన్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఐఏఎస్, ఐపీఎస్, ప్రొవెన్షియల్ సివిల్ సర్వీస్ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యం. ఆ స్ఫూర్తితో మంత్రులంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలను ప్రకటించాలి. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పట్నుంచి మూడు నెలల్లోపు ప్రకటించాలి" అని సూచించారు.
యోగి 'మార్క్' పాలన.. వారంతా ఆస్తులు ప్రకటించాలని ఆదేశం - యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన
Yogi Adityanath news: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాలన్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు.
అలాగే, వచ్చే 100 రోజులు, ఆర్నెళ్లు, ఐదేళ్ల పని ప్రణాళికకు సంబంధించి అన్ని శాఖలతో సమీక్షించారు. ఈ ప్రణాళిక క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా అధికారులకు మార్గదర్శనం చేయాలని ఆయా శాఖలకు ఆదేశించారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో అంత్యోదయ తీర్మానాన్ని నెరవేర్చేందుకు అంతా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు వీలుగా యోగి మంత్రుల సారథ్యంలో 18 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో మంత్రి సారథ్యం వహించి.. రాష్ట్రమంతా పర్యటించి స్థానిక నాయకులు, ప్రముఖ వ్యక్తులతో సమావేశమై అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యేలోపు మంత్రులు తమ రాష్ట్రవ్యాప్త పర్యటన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ 'గ్రూప్ ఆఫ్ 18' శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని 75 జిల్లాల పరిధిలోని 18 డివిజన్లలో పర్యటించి చర్చించి ప్రజా సమస్యల్ని తెలుసుకుంటుందన్నారు. మురికివాడలు, దళితవాడల్లో భోజనాలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ 18 బృందాలు సీఎంవోలో తమ నివేదికల్ని సమర్పించాలని సూచించారు. సోమ, మంగళవారాల్లో మంత్రులు రాష్ట్ర రాజధానిలోనే ఉండాలనీ.. శుక్ర వారం నుంచి ఆదివారం వరకు వారు ఇంఛార్జిలుగా ఉన్న జిల్లాల్లో పర్యటించాలని సూచించారు.
ఇదీ చదవండి:'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్కు పీకే ఝలక్!