తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్‌ను ఫినిష్ చేయడానికి.. రాహుల్‌, ప్రియాంక చాలు!' - యోగి ఆదిత్యనాథ్ ఏఎన్ఐ ఇంటర్వ్యూ

Yogi Adityanath ANI Interview: కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆ పార్టీ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హస్తం పార్టీని నాశనం చేసేందుకు వేరెవరూ అవసరం లేదన్న ఆయన.. రాహుల్, ప్రియాంకలే ఆ పని చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా యూపీలో గత పాలకులపై మండిపడ్డారు.

Yogi Adityanath ANI Interview
Yogi Adityanath ANI Interview

By

Published : Feb 14, 2022, 3:08 PM IST

Yogi Adityanath ANI Interview: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హస్తం పార్టీని నాశనం చేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు ఇద్దరు చాలు అంటూ ధ్వజమెత్తారు. రెండో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి యోగి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Rahul Priyanka finish Congress

"కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి, ఆ పార్టీని పడేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు(రాహుల్, ప్రియాంకను ఉద్దేశిస్తూ) చాలు. ఇంకెవరూ అవసరం లేదు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలోనూ నేను ఇదే చెప్పాను. కాంగ్రెస్ మునిగిపోయింది. ఆ పార్టీ రాష్ట్రానికి భారం కాకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా. అలాంటి పార్టీకి ఎందుకు మద్దతివ్వాలి"

-యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

80 x 20 వ్యాఖ్యలు.. మతాన్ని ఉద్దేశించినవి కావు

UP CM Yogi on Hijab: ఈ ఇంటర్వ్యూలో భాగంగా యూపీ రాజకీయాలు, కర్ణాటక హిజాబ్‌ వివాదం వంటి అంశాలపై యోగి మాట్లాడారు. ఇటీవల తొలి విడత పోలింగ్‌ తర్వాత ఆయన చేసిన '80శాతం వర్సెస్‌ 20శాతం' వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హిందూ, ముస్లింల జనాభాను ఉద్దేశించే యోగి అలా మాట్లాడారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అయితే, ఈ వివాదంపై యూపీ సీఎం తాజాగా స్పందించారు. తాను మతాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

Yogi Adityanath on congress:

"రాష్ట్రంలో 80శాతం ప్రజలు భాజపావైపు ఉన్నారు. ప్రభుత్వ అజెండాతో వీరంతా సంతోషంగా ఉన్నారు. 20శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వీరు ప్రభుత్వం ఏం చేసినా ప్రతికూలంగానే ఆలోచిస్తారు. ఆనాడు కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. అంతేగానీ, మతం, కులాన్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయలేదు" అని యోగి వివరణ ఇచ్చారు.

ఇక కర్ణాటక హిజాబ్‌ వివాదంపై స్పందిస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి భారత్‌ నడుస్తోందని, అంతేగానీ, ఎలాంటి మతపరమైన చట్టాలపై ఆధారపడి పనిచేయబోదంటూ వ్యాఖ్యానించారు.

ఆ ఏనుగు పొట్టలో ఎంత వేసినా తక్కువే!

ఉత్తర్​ప్రదేశ్​ను పాలించిన గత ప్రభుత్వాలపైనా విరుచుకుపడ్డారు యోగి. రాష్ట్ర ఖజానాను దోచుకోవడంపైనే వారి శ్రద్ధ ఉండేదని మండిపడ్డారు. పేద ప్రజలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 'సమాజ్​వాదీ పార్టీ గూండాలే' తినేశారని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదలకు రెట్టింపు రేషన్ ఇస్తోందని, గతంలో ఈ నిధులన్నీ ఏమై ఉంటాయని ప్రశ్నించారు. మాయావతి ఏనుగు(బీఎస్​పీ ఎన్నికల చిహ్నం) పొట్ట చాలా పెద్దదని, దానికి ఎంతైనా తక్కువేనని అన్నారు.

రాష్ట్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తుందని యోగి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి:'కాంగ్రెస్​తో కష్టమే.. కేసీఆర్​, స్టాలిన్​తో కలిసి దిల్లీపై గురి!'

ABOUT THE AUTHOR

...view details