YCP Leaders Met CM Jagan in Tadepalli:ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలోని నాయకులకు ఆందోళన కలుగుతోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరికి టికెట్ వస్తుందో తెలియక అయోమయంలో పడుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఇంఛార్జ్‌ల మార్పుపై కసరకత్తు చేస్తూనే ఉన్నారు. టికెట్టు విషయంలో చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతూనే ఉన్నారు. తాజాగా పార్టీ పెద్దల నుంచి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. బుధవారమే మూడవ జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ రోజు నేతలతో చర్చించిన తరువాత కొత్త ఇన్‌ఛార్జ్‌ల జాబితా జగన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కోస్తాలో వైసీపీకి దడ - పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీతో సంప్రదింపులు
సందిగ్ధంలో జోగి రమేష్:కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ అక్కడి నుంచే తిరిగి పోటీ చేసేందుకు యత్నిస్తుండగా ఆయన్ను మరో స్థానానికి మార్చాలని సీఎం నిర్ణయించారు. మైలవరం ఆశించగా ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కే సీఎం అప్పగించారు. దీంతో జోగికి ఎక్కడ సీటు ఇవ్వాలనే విషయమై స్పష్టత రాలేదు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి వైసీపీను వీడాలని నిర్ణయించుకున్న పరిస్ధితుల్లో ఆయన స్థానం నుంచి జోగిని రంగంలోకి దింపాలని సీఎం యోచిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని పెనమలూరు నుంచి పోటీ చేసే విషయమై సీఎం చర్చించారు. పార్థసారథి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో బీసీ సామాజిక వర్గానికే చెందిన జోగి రమేష్‌ను రంగంలోకి దింపేందుకు యత్నిస్తున్నారు. కానీ తాను పోటీ చేసే సీటు విషయమై చర్చించిన జోగి రమేష్‌కు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ - అవమానంతో పార్టీని వీడుతున్న నేతలు
పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎంపిక చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో జగన్ చర్చించేందుకు సిద్థమయ్యారు. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై చర్చించేందుకు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నియామకంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర నాథ్ రెడ్డి( నాని) తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంవో లో పనుల కోసమే తాను వచ్చినట్లు గంగుల నాని తెలిపారు. తాను ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని, ఎలాంటి మార్పు ఉండదని నాని స్పష్టం చేశారు.
ఇంకా వైసీపీలోని కీలక నేతలైన మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు తాడేపల్లి వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఎమ్మెల్యే సంజీవయ్యకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు రావడంతో సీఎంవోకు బయలుదేరారు. జగన్‌తో సమావేశమై సీటు విషయమై ఎమ్మెల్యే సంజీవయ్య చర్చించనున్నారు. నందికొట్కారు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ స్థానంలో మరొకరికి సీటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ విషయమై మరోసారి జగన్ వద్దకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తన సీటు విషయమై చర్చించారు.
కంట తడి పెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ - టికెట్ ఇవ్వనందుకేనా?
ఇన్‌ఛార్జ్ మార్పుల్లో వివాదాలు:వైసీపీలో జరుగుతున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్పుల్లో వివాదాలు రగులుతూనే ఉన్నాయి. మన్యం జిల్లా అరకు ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ మాధవిని ప్రకటించగా ఆ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే చెట్టి పల్గున వర్గం ఆందోళనలు చేపట్టారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలిచి సీటు వ్యవహారం, ఆందోళనలపై చర్చించనున్నారని సమాచారం.
రెండు రోజులుగా క్యూ కడుతున్న నేతలు:ఇప్పటికే రెండు జాబితాల్లో 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన సీఎం జగన్ మరిన్ని మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తాడేపల్లి కార్యాలయానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, చిత్తూరు ఎమ్మేల్యే ఆరాని శ్రీనివాసులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మేల్యే అదీప్ రాజ్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటు విషయమై జగన్‌తో చర్చించారు.