Yavatmal news: మద్యానికి బానిసైన తండ్రితో ఆ అలవాటు మాన్పించి అందరితో శభాశ్ అనిపించుకున్నాడు 13 ఏళ్ల అంకుశ్ రాజు ఆడె. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఆర్ణీ తాలుకాలోని లోన్బెహ్ల్కు చెందిన ఇతడు.. వినూత్న రీతిలో ఈ పని చేశాడు. గ్రామ సభలో పాల్గొని తన తండ్రిని మద్యం తాగకుండా ఆదేశించాలని కోరాడు. ఈ చెడు అలవాటు వల్ల తన కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందని చెప్పాడు. దీంతో చలించిన గ్రామపెద్దలు తాగుడు మానాలని బాలుడి తండ్రి రాజును ఆదేశించారు. జీవితంలో మళ్లీ మద్యం ముట్టొద్దని హుకుం జారీ చేశారు. అందుకు రాజు కూడా ఒప్పుకున్నాడు. తన కమారుడి కోసం ఇక తాగనని వాగ్దానం చేశాడు.
అంకుశ్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదవుతున్నాడు. వీళ్ల గ్రామంలో బంజారాలు ఎక్కువగా ఉంటారు. అంకుశ్ తండ్రికి కొంత సాగు భూమి ఉన్నా.. అతని తాగుడు అలవాటు కారణంగా కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. వచ్చిన డబ్బంతా మద్యం కోసమే ఖర్చు అయ్యేది. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తప్పని పరిస్థితుల్లో తానే స్వయంగా కూరగాయలు అమ్ముతూ తల్లికి సాయంగా నిలుస్తున్నాడు అంకుశ్. తన సోదరిని డాక్టర్ చదివించాలనేది అతని కల. అయితే తండ్రి తాగుడు మానకపోతే ఇది సాధ్యం కాదని గ్రహించిన అతడు ఈ అలవాటు మాన్పించే ప్రయత్నం చేశాడు. దీని దుష్ప్రభావాల గురించి గ్రామమంతా తిరిగి ప్రచారం చేశాడు. చివరకు గ్రామసభలో ఫిర్యాదు చేశాడు. బాలుడి ఆలోచనను మెచ్చుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్ రాజును మద్యం మానేయాలని సూచించారు. శిక్షగా ఐదు గుంజీలు కూడా తీయించారు.