తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాదిలో మళ్లీ భారీ వర్షాలు.. తాజ్​మహల్​ను తాకిన 'యమున'! 45 ఏళ్ల తర్వాత.. - ముంబయిలో వర్షాలు

North India Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో యమునా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 45 ఏళ్ల తర్వాత దిల్లీలోని తాజ్​మాహల్​కు యమున వరద తాకింది. ముంబయిలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో దిసాంగ్, డిఖో నదుల నీటిమట్టం పెరగడం వల్ల శివసాగర్‌లోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి నెలకొంది. NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 19, 2023, 12:31 PM IST

Delhi Rains Update : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని దిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. బుధవారం ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది.

యమునా నది నీటి మట్టం..
Yamuna Water Level : బుధవారం.. ఉదయం 8 గంటల సమయానికి దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లను దాటి 205.48 మీటర్లుగా నమోదైనట్లు కేంద్ర జల కమిషన్‌ తెలిపింది. బుధవారం సాయంత్రానికి 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైమ్​ గరిష్ఠానికి చేరి 208.66మీటర్లుగా నమోదవడం వల్ల దిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.

తాజ్​మహల్​ను తాకిన వరద!
Agra Taj Mahal Rain : ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల.. చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ సమీపానికి యమునా వరద చేరుకుంది. ఓ గార్డెన్‌ కూడా నీట మునిగిందని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా 45 ఏళ్ల కిందట.. ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చెబుతోంది.

ముంబయిలో భారీ వర్షాలు
Maharastra Rains : మహారాష్ట్ర, ముంబయిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాల్ఘర్, రాయ్‌గఢ్​ జిల్లాలకు భారత వాతావరణ శాఖ- IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఠాణె, ముంబయి, రత్నగిరి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

అసోంలో భారీగా పెరిగిన నదుల నీటిమట్టం
Assam Rains : అసోంలో దిసాంగ్, డిఖో నదుల నీటిమట్టం భారీగా పెరిగింది. శివసాగర్‌లోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి నెలకొంది. NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్ని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

గుజరాత్​లో మరో మూడు రోజులు వర్షాలే..
Gujarat Rains : గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాజ్‌కోట్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ధోరాజిలో పెద్ద ఎత్తున వాహనాలు నీట మునిగాయి. రానున్న రెండు మూడు రోజుల్లో గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆ రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. గిర్‌ సోమ్‌నాథ్‌, కచ్‌, నవ్‌సరి, వల్సాద్‌, అమ్రేలీ, రాజ్‌కోట్‌ జిల్లాల్లో NDRF బలగాలను రంగంలోకి దింపింది. గుజరాత్‌లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

ఉత్తరాదికి మళ్లీ వర్షాల ముప్పు..
North India Rains Update : ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details