Yamuna Expressway Accident :దిల్లీ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మరణించారు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ గుర్తు తెలియని వాహనం.. దిల్లీ నుంచి ఝార్ఖండ్ వెళ్తున్న కారును ఢీకొట్టడం వల్ల ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం తరలించారు. మృతులను ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం వీరంతా దిల్లీలో నివసిస్తున్నారని.. సెలవుల నేపథ్యంలో సొంతూరుకు వెళ్తున్నట్లు సమాచారం. మృతులను సురేశ్(45), ఉపేంద్ర(38), విజేంద్ర(36), అతడి భార్య కంతి దేవి(30), కూతురు జ్యోతి(12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మరణించారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు."
--పోలీసులు