తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వార్నింగ్​ మార్క్​ దాటిన యమునా నది.. దిల్లీకి వరద ముప్పు!.. వర్షాలపై మోదీ సమీక్ష - Rains And Floods In North Inida

Rains In Delhi : దిల్లీని ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే వార్నింగ్‌ మార్క్‌ను దాటిన నది నీటిమట్టం.. ప్రమాదకర స్థాయికి చేరువైంది. మరోవైపు ఉత్తరాదిపై కురుస్తున వర్షాలపై ప్రధాని మోదీ.. మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Rains And Floods In North Inida
ఉత్తారాదిలో వర్షాలు వరదలు

By

Published : Jul 10, 2023, 3:57 PM IST

Updated : Jul 10, 2023, 4:07 PM IST

Rains In Delhi : దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హెచ్చరిక మార్క్‌ను దాటిన యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరువైంది.

Delhi Rains Kejriwal Meeting : దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అత్యవసర సమావేశం నిర్వహించి వరద పరిస్థితులపై సమీక్షించారు. దిల్లీకి వరద పరిస్థితి రాకపోవచ్చని అయినా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ యమునా నది నీటిమట్టం 206 మీటర్లు దాటితే యమునా నది పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్లపై గుంతలను ఎప్పటికప్పుడు పూడుస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దిల్లీలో రోడ్లు కుంగిన ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

భారీ వర్షాల కారణంగా హతనికుంద్‌ బ్యారేజ్‌ నుంచి హరియాణా మరింతగా నీటిని విడుదల చేసింది. దీంతో యమునా నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరద ముప్పు పొంచి ఉండటం వల్ల దిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 16 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌, బోట్లను అందుబాటులో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు యమునా నది నీటిమట్టం 204.88 మీటర్లు దాటినట్లుగా అధికారులు తెలిపారు. నీటిమట్టం 205.33 మీటర్లు దాటితే గనుక దానిని అతి ప్రమాదకరంగా భావిస్తారు. ఇప్పటివరకు 2,13,679 క్యూసెక్కుల నీటిని హత్నికుంద్​ బ్యారేజ్​కు విడుదల చేశారు.

వర్షాలపై మోదీ సమీక్ష..
PM Modi Meeting On Rainfall : కుండపోత వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలమవుతున్న వేళ.. ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని.. బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. NDRF, SDRF బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో మోహరించాలని సూచించారు. స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నిర్దేశించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది.

అందుబాటులోనే ఉంటా..
Himachal CM Meeting On Rainfall : ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ రాబోయే 24 గంటలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని.. ఎవరూ బయటకు రావద్దని సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ కోరారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు ఇస్తూ.. ఒక వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఉంచారు. 24 గంటలు తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని.. ఎమ్మెల్యేలు కూడా తమతమ నియోజకవర్గాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 14 మంది మృతి చెందారని.. అందువల్ల ప్రజలందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సుఖ్వీందర్‌ కోరారు. సహాయక చర్యలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లును కూడా ప్రకటించారు. నేడు, రేపు హిమాచల్‌లో అన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు సుఖ్వీందర్‌ పేర్కొన్నారు.

పంజాబ్​లోనూ వరణుడి పంజా..
పంజాబ్‌లో కూడా భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరదలు సంభవించాయి. ఆనంద్‌పుర్‌ సాహిబ్‌, నూర్‌పుర్‌ బేడీ సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రూప్‌నగర్‌, మొహాలీ, పటియాలాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సైన్యాన్ని కూడా అప్రమత్తంగా ఉంచారు. మొహాలీ, ఫతేఘర్ సాహిబ్ ప్రాంతాల్లో NDRF సిబ్బందిని మోహరించారు. రూప్‌నగర్‌-నంగాల్‌ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రూప్‌నగర్‌-చండీగఢ్‌ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

పేకమేడల్లా కూలిపోతున్న పురాతన కట్టడాలు..
Jammu Kashmir Rainfall : దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు చాలా ప్రాంతాల్లో ఆపార ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఆకస్మికంగా వరద పోటెత్తడం వల్ల భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. జమ్ముకశ్మీర్‌లో కుండపోత వానలకు వరద పోటెత్తుతోంది. లేహ్‌లోని ఖరౌక్‌ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి 450 ఏళ్ల క్రితం నాటి పురాతన భవనం కుప్పకూలింది. గతంలో ఎన్నో విపత్తులను తట్టుకొన్న ఈ భవనం ప్రస్తుతం కురిసిన భారీ వర్షాల ధాటికి కుప్పకూలిందని స్థానికులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా లద్ధాఖ్‌లో పురాతన ఇళ్లు చాలా దెబ్బతిన్నాయని.. గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన భవనాలు నేలకూలడం వేదనకు గురి చేసిందని స్థానికులు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది భారీగా వర్షపాతం నమోదైందని.. చాలా ఇళ్లలోకి వరద పోటెత్తిందని వాపోయారు. 2010లోనూ భారీ వర్షాలు కురిసినా ఇంత నష్టం జరగలేదని ఈసారి ఎప్పుడూ చూడని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. లద్దాఖ్‌లో 24 గంటల పాటు రెడ్ అలర్ట్‌ జారీ చేశారు. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసేశారు.

Last Updated : Jul 10, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details