తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రెజ్లర్ల కేసులో సాక్ష్యాలు లేవా?' దిల్లీ పోలీసుల ప్రకటనలతో గందరగోళం.. ఉరేసుకుంటానని బ్రిజ్ భూషణ్ సవాల్

Wrestlers Protest: భారత రెజ్లింగ్​ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్​కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసు పరిశీలనలో ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు. దర్యాప్తు నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పించనున్నట్లు ట్వీట్​ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్​ను తొలగించారు. మరోవైపు, బ్రిజ్​ భూషణ్​.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు నిజమని రుజువైతే ఉరి వేసుకుంటానని సవాల్​ చేశారు.

Wrestlers Protest Latest News
Wrestlers Protest Latest News

By

Published : May 31, 2023, 6:59 PM IST

Wrestlers Protest Latest News : భారత రెజ్లింగ్​ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు పరిశీలనలో ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు. దర్యాప్తు నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పించనున్నట్లు చెప్పారు. అయితే అంతకుముందు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించనందునే అరెస్టు చేయడం లేదని.. మరో 15 రోజుల్లో నివేదిక రూపంలో దిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పిస్తారని వార్తలు వచ్చాయి. దీంతో దిల్లీ పోలీసులు ట్విట్టర్​లో స్పష్టతనిచ్చారు. కానీ ఆ తర్వాత ఆ ట్వీట్​ను డిలీట్ చేశారు.
ఆ తర్వాత దిల్లీ పోలీసు ప్రతినిధి మరోసారి స్పందించారు. "మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన కేసులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఈ కేసుల్లో దర్యాప్తునకు సంబంధించి నివేదికలు కోర్టు ముందు దాఖలు చేస్తాం" అని ట్వీట్​ చేశారు.

మైనర్​ వివరాలు బహిర్గతం.. కేసు నమోదు చేయాలన్న స్వాతి!
బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌.. లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేసిన రెజ్లర్​ (మైనర్​) వివరాలను బహిర్గతం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ స్వాతి మాలివాల్​.. పోలీసులను కోరారు. "బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదు చేసిన మైనర్​కు మేనమామ అని చెప్పి ఒక వ్యక్తి.. బాలిక వివరాలను బహిర్గతం చేస్తున్నాడు. నేను పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నాను. ఆ వ్యక్తిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి" అంటూ స్వాతి మాలివాల్​ ట్వీట్ చేశారు.

లైంగిక ఆరోపణలు నిజమైతే ఉరేసుకుంటా: బ్రిజ్​ భూషణ్​
భారత రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో బ్రిజ్​ భూషణ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు నిజమని రుజువైతే ఉరి వేసుకుంటానని బుధవారం అన్నారు. ఆరోప‌ణ‌ల్లో ఒక్కదాన్ని నిరూపించినా.. ఉరి వేసుకుంటానని సవాలు చేశారు. రెజ్లర్ల ద‌గ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, వాటిని కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని, శిక్షను అనుభ‌వించ‌డానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

తనను ఉరి తీయాలని రెజ్లర్లు నాలుగు నెలల నుంచి కోరుతున్నా.. ప్రభుత్వం తనను ఉరితీయడం లేదు కాబట్టి వారు తమ పతకాలను సైతం గంగలో నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. పతకాలను గంగలో కలిపినంత మాత్రాన తనకు ఉరి శిక్ష పడదని.. రెజ్లర్ల వద్ద తగిన ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పిస్తే అప్పుడు ఏ శిక్షకు అయినా తాను సిద్ధమేనని బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ వెల్లడించారు.

"మనమందరం ఏ సంప్రదాయం నుంచి వచ్చాం? అయోధ్య కాలం నాటి సంప్రదాయం నుంచి వచ్చాం. రాముడి కాలం నాటి సంప్రదాయం నుంచి వచ్చాం. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం స్వీకరించాడు. మనం ఆ సంప్రదాయం నుంచి వచ్చాం. నేను నాపై ఆరోపణలు వచ్చిన రోజే చెప్పాను. ఎప్పుడు జరిగింది? ఎక్కడ ఎవరితో జరిగింది? అని. అలాగే ఇంకొకటి కూడా చెప్పాను. నాపై ఏ ఒక్క ఆరోపణ అయినా రుజువైతే బ్రిజ్‌ భూషణ్‌ స్వయంగా ఉరి వేసుకుంటాడు అని. నేను ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను."

--బ్రిజ్ భూషణ్ సింగ్, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు

'విచారణను విశ్వసించండి.. ఓపికగా ఉండండి'
తమ ప్రాణ సమానమైన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ స్పందించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను విశ్వసించాలని, ఓపికగా ఉండాలని రెజ్లర్లను కోరారు. క్రీడలను అణగదొక్కే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని రెజ్లర్లకు ఆయన సూచించారు.

'గంగానదిలో పతకాలను నిమజ్జనం చేయొద్దని మోదీ ఎందుకు కోరలేదు?'
Wrestlers Protest Congress : బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై భారత రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ స్పందించింది. అధికార బీజేపీపై మండిపడింది. 'బేటీ బచావో.. బేటీ పఢావో' అనే బీజేపీ నినాదానికి ఇప్పుడు అర్థం 'బేటీ బీజేపీ కే నేతావోం సే బచావో' (బీజేపీ నేతల నుంచి కూతుళ్లను రక్షించండి)' అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గంగానదిలో పతకాలను నిమజ్జనం చేయొద్దని ప్రధాని మోదీ.. రెజ్లర్లకు ఎందుకు కోరలేదని ప్రశ్నించింది.

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్​ పార్టీ ఎంపీ దీపిందర్​ సింగ్​ హుడా రెజ్లర్ల నిరసనలపై స్పందించారు. "రెజ్లర్లకు పతకాలే వారి జీవితం. వారి కుటుంబాల త్యాగాలకు, జాతి గర్వానికి పతకాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అలాంటి మల్లయోధులు తమ పతకాలను నిమజ్జనం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? పతకాలు సాధించినప్పుడు ఈ క్రీడాకారులతో ఫొటోలు దిగేందుకు క్యూలో నిలబడిన ప్రధాని ఒక్క విజ్ఞప్తి కూడా ఎందుకు చేయలేదు? ఒక ఆడపిల్ల న్యాయం కోరితే ఆమెకు న్యాయం చేయడం రాజధర్మం.. పార్లమెంటు ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు మహిళలను ఈడ్చుకెళ్లిన తీరు అందరూ చూశారు" అని హూడా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. క్రీడాకారులపై ఇంత ద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మల్లయోధులు తమ పతకాలను గంగలో కలపవద్దని ప్రధాని విజ్ఞప్తి చేయకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు.

రెజ్లర్లకు సంఘీభావంగా మమత ర్యాలీ
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజు రెజ్లర్లను పోలీసులు నిర్బంధించేందుకు యత్నించిన ఘటనపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ నిరసన తెలిపారు. కోల్​కతాలోని హజ్రా రోడ్డు నుంచి రవీంద్ర సదన్ వరకు జరిగిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. "వి వాంట్ జస్టిస్" అనే సందేశంతో రాసిన ప్లకార్డుతో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. "మల్లయోధులపై తీవ్రంగా దాడిచేశారు. ఈ ఘటన దేశ ప్రతిష్ఠను దిగజార్చింది. రెజ్లర్లకు సంఘీభావం తెలుపుతున్నాను" అని మమత వ్యాఖ్యానించారు.

Wrestlers Protest Issue : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడంటూ.. దాదాపు నెల రోజులకు నుంచి దేశ రాజధాని దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్లు వినేశ్‌ ఫోగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌ రంగ్‌ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భూషణ్​ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం(మే 28) ఆందోళనలను తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. అటు వైపు మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసుల నిర్బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తోపులాటలో పలువురు అథ్లెట్లు కింద పడిపోయిన దృశ్యాలు కూడా సోషల్​మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం అధికారులు నిరసనకారులందరినీ నిర్బంధించారు. అథ్లెట్లు శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకు.. తగిన విచారణ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెజ్లర్ల దీక్షా శిబిరాన్ని కూడా తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details